Nellore News: మద్యానికి బానిసైన కొడుకుని రోకలిబండతో హత్య చేసి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కొడుకు శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు కన్న తండ్రి. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు చేరడంతో వారు కొడుకు మల్లికార్జున్ శవాన్ని వెలికి తీశారు. శ్మశాన వాటికకు వెళ్లి శవాన్ని వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేయించబోతున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసులు గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా.. తల్లి పరారీలో ఉంది.
ఆదివారం (08-05-2022) మధ్యాహ్నం 02.30 గంటలకు నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. బత్తిన శ్రీనివాసులు కుటుంబం అక్కడ నివసిస్తుండేది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోగా.. కుమారుడు మల్లికార్జున (24) లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లికార్జున రోజూ ఇంటికి తాగొచ్చేవాడు. అంతేకాదు, తాగి ఇంటికొచ్చిన తర్వాత అందరికీ నరకం చూపించేవాడు. ఇంట్లో అందరినీ వేధించేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు సరిపోవడంలేదని ఇంట్లో వాళ్లని కొట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. అతనికి ఫిట్స్ వ్యాధి కూడా ఉంది.
ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె మల్లికార్జున నుంచి తప్పించుకోబోయింది. అయితే అంతలోనే తండ్రి అడ్డుపడ్డాడు. తల్లిదండ్రులపై దాడి చేయడం సరికాదని వారించబోయాడు. దీంతో మల్లికార్జున మరింత రెచ్చిపోయాడు. స్క్రూ డ్రైవరుతో తలపై దాడి చేయడంతో తండ్రి శ్రీనివాసులకు గాయాలయ్యాయి. దీంతో ఆయన కోపంతో ఊగిపోయారు. మల్లికార్జున చంపేస్తాడేమోనన్న భయంతో పక్కనే ఉన్న రోకలి బండతో కుమారుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బతో మల్లికార్జున అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హఠాత్పరిణామంతో తల్లి అక్కడినుంచి పరారైంది. ఆ తర్వాత తండ్రి శ్రీనివాసులు కథ నడిపాడు.
ఫిట్స్ తో తన కొడుకు మల్లికార్జున చనిపోయాడని బంధువులను నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఆదివారం రాత్రి శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చేశాడు. కానీ స్థానికులు మాత్రం ఈ వ్యవహారాన్ని చర్చింకుంటున్నారు. చివరకు పోలీసుల వరకు సమాచారం వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తలకు గాయమైన తండ్రి శ్రీనివాసులను మొదట ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి పరారు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు.
నవాబుపేట ఇన్‌స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. మల్లికార్జున మృతికి కారణాలు తెలుసుకునేందుకు శవాన్ని వెలికి తీశారు. రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టు తెలిపారు సీఐ సుబ్బారావు.