Tirumala : తిరుపతి: తిరుమల శ్రీవారి ఆనంద నిలయం వీడియో తీసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రాహుల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఉద్దేశ్యపూర్వకంగా మొబైలో ను తీసుకెళ్లి ఆనంద నిలయం చిత్రీకరించారని టీటీడీ అధికారులు అనుమానిస్తున్నారు. రాహుల్ రెడ్డి ఆలయంలోకి మొబైల్ ను ఎలా తీసుకెళ్లారనే విషయమై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు.
ఆనంద నిలయాన్ని వీడియో తీసారంటూ టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రెండు ప్రత్యేక బృందాలు, ఒక టెక్నికల్ టీంను నియమించి నిందితుడి కోసం గాలించడం జరిగిందని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఐతే కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి శ్రీవారి ఆలయంలో వీడియోలు తీసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి గురువారం సాయంత్రం రాహుల్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి రాహుల్ మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి తీసుకెళ్లాడని, ఆలయంలో తీసిన వీడియోలను రాహుల్ స్టేటస్ లో పెట్టడంతో పాటు వారి బంధువులకు పంపించిన్నట్లు విచారణలో తేలిందన్నారు.
ఆలయంలో వీడియో తీసింది వివాదమవుతున్నట్లు మీడియాలో రావడాని చూసిన రాహుల్ ఎవిడెన్స్ ని చేరిపి వేశాడన్నారు.. రాహుల్ ని ఆలయంలోకి తీసుకెళ్లి భద్రతా లోపం ఎక్కడ జరిగిందో పునః పరిశీలిస్తున్నామని మునిరామయ్య తెలిాపరు. భక్తుల మొబైల్ ఫోన్ ని ఆలయం లోపలకి అనుమతించమని, భద్రతా లోపాలని గుర్తించి, పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.. రాహుల్ ఏ ఆలయంకు వెళ్ళినా, ఆ ఆలయాన్ని వీడియో తీస్తున్నాడని, ఆ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో చిత్రికరణ చేశాడన్నారు. గత నెలలో తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని ఎస్పీకి మెయిల్ వచ్చింది.ఈ మెయిల్ ఫేక్ అని పోలీసులు తేల్చి చెప్పారు.
తిరుమల ఆలయంలోకి మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక వస్తువులు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఈ నిషేధం ఉన్నా కూడా రాహుల్ రెడ్డి మొబైల్ ఫోన్ ను ఆలయంలోకి ఎలా తీసుకెళ్లారనే విషయమై ఇప్పుడు టీటీడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత నెలలో టీటీడీ ఆలయంపై నుండి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ ప్రాంతమైన తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు తిరుమల మీదుగా చెన్నైకి బయలుదేరాయని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకుంటామని విజిలెన్స్ అధికారులుచెబుతున్నారు. విధుల విషయంలో భద్రతా సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారా అనే విషయమై కూడా దర్యాప్తు నిర్వహిస్తున్నామని అంటున్నారు.