దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతించారు. ఆ ప్రాంతాలను పక్కనున్న నగర పాలకసంస్థల్లో విలీనం చేయాలని, కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్‌లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇది కోట్ల మంది ప్రజలకు నిజంగా గొప్ప శుభవార్తేనని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 


సోషల్ మీడియా వేదికగా  స్పందించిన విజయసాయిరెడ్డి సికింద్రాబాద్‌ కంటోన్మెంటు బోర్డు పరిధిలో జరిగిన ఘటనలు వివరించారు. కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు అలజడి చెలరేగడం తెలుసని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతోఈ కంటోన్మెంట్లలో లక్షల ఎకరాల ఖాళీ భూములను స్థానిక సంస్థలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారని అన్నారు. 


హైదరాబాద్, ఆగ్రా వంటి 62 నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోందన్నారు సాయిరెడ్డి. చాలీచాలని సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికైన పౌర ప్రజానీకం ప్రతినిధులు, మిలిటరీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పాలనసాగే ఈ మిలిటరీ కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాల్లో మరో సమస్య ఉందని తెలిపారు. సాధారణ ప్రజలకు ప్రభుత్వాలు అందించించే పథకాలు, సదుపాయాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అందడం లేదన్నారు. తాజా నిర్ణయంతో ప్రజలకు రాష్ట్రాలు నుంచి అన్ని ప్రయోజనాలు సమకూరుతాయన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అతి పెద్ద భూస్వామి రక్షణ శాఖ. దేశంలో ఈ శాఖకు 17.99 లక్షల ఎకరాల భూమి ఉండగా, మొత్తం 62 మిలిటరీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని ఢిల్లీలోని డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ కార్యాలయం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములు చాలా వరకూ ఇక ముందు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.