TTD Hundi Income : తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలోవస్తోంది. జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షలు ఆదాయంగా వచ్చింది. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారని దేవాలయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం.  ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉంది. 


ఈ ఏడాది వైభవంగా తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు, తేదీలు ఖరారు చేసిన టీటీడీ


టిటిడికి గత ఐదు నెలలుగా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసి వస్తోంది.   మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్‌ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్లు , జూన్‌ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ నాలుగో తేదీ టిటిడి చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్‌ చేసింది. ఈ ఏడాది మొత్తం ఆదాయం సుమారుగా రూ.1500 కోట్లనూ దాటేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


శ్రీనివాసుడికి ఇష్టమైన శనివారం తిరుమలలో జరిగే ప్రత్యేక సేవలు మీకు తెలుసా !


కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులు అందుకు తగ్గట్లే స్వామివారికి పెద్ద మొత్తంలో మొక్కులు, కానుకలు సమర్పిస్తుంటారు. అయితే కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు స్వామివారి దర్శనం పరిమిత సంఖ్యలోనే కల్పించారు. కొవిడ్‌ ఆంక్షలతో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చాక సాధారణ రోజుల మాదిరిగానే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తులు వెంకన్న దర్శనానికి పోటెత్తుతున్నారు.  


వారంతా మొక్కులు తీర్చుకుంటున్నారు.ఈ కారణంగా హుండీ ఆదాయం భారీగా పెరిగినట్లుగా భావిస్తున్నారు. హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతుందే కానీ తగ్గదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.