TDP High Command Serious On Gummanuru Jayaram: వ్యతిరేక వార్తు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ టీడీపీ ఎమ్మల్యే గుమ్మనూరు జయరాం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి సంస్కృతి టీడీపీలో లేదని జాగ్రత్తగా మసులుకోవాలని హెచ్చరించారు. 

రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటు బెదిరింపు 

బుధవారం ఉదయం పాత్రికేయులతో సమావేశమైన గుమ్మనూరు జయరాం తనకు, తన తమ్ముడికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే బాగోదని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో ఇప్పుడే మాట్లాడాలంటూ పాత్రికేయులకు బెదరించారు. తర్వాత ఇష్టం వచ్చినట్టు రాస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. తప్పుడు వార్తలు రాసే పాత్రికేయులను రైలు పట్టాలపై పడుకోబెడతాననే పేరు ఉందని అదే చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

గతంలో ఇలాంటివి చేశానంటూ హెచ్చరిక 

ఇలాంటివి చాలా చేసి ఈస్థాయికి వచ్చానంటూ గుమ్మనూరు కూల్‌గానే హెచ్చరించారు. వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలన్నారు. తనవైపు తప్పు ఉంటే సరిదిద్దుకుంటానంటూనే అనవసరంగా రాస్తే మాత్రం తాటతీస్తానంటూ బెదిరించారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే తననే నేరుగా అడగాలంటూ కూడా చెప్పుకొచ్చారు. 

Also Read: అవి అటవీ భూములు కాదు ..కొనుగోలు చేశాం - అడవి కబ్జా ఆరోపణలపై పెద్దిరెడ్డి వివరణ

వైరల్‌గా మారిన గుమ్మనూరు జయరాం కామెంట్స్ 

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన ఈ కామెంట్స్‌ ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికారం ఉందన్న అహంతో ఇలాంటి వార్నింగ్‌ ఇచ్చారని అంతా విమర్శలు చేశారు. ఏకంగా మీడియాపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో టీడీపీ అధినాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు పల్లా ఫోన్ 

నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుమ్మనూరు జయరాంకు ఫోన్ చేసి తలంటారు. ఇలా మీడియాను, వార్తలు రాసే జర్నలిస్టులను బెదిరించే సంస్కృతి టీడీపీలో లేదని గుర్తు చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీనిపై చంద్రబాబు చాలా కోపంతో ఉన్నారని ఇలాంటివి రిపీట్ చేయొద్దని కూడా హెచ్చరించారు.   

గుమ్మనూరు జయరాం ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉండేవారు. అక్కడ మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పుడు కూడా ఇదే దూకుడుతో ఉండేవారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక్కడ టికెట్ సంపాదించి కూటమి తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

Also Read: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్