Ex minister Peddireddy Ramachandra Reddy: వైఎస్ఆర్‌సీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల వ్యవహారం రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ఆయన పులిచర్ల మండలం మంగళం అటవీ ప్రాంతంలో 70 ఎకరాలకుపైగా భూమిని కబ్జా చేసి ఓ విలాసవంతమైన గెస్ట్ హౌస్‌తో పాటు.. పశువుల షెడ్లను నిర్మించుకున్న విషయం వెలుగు చూసింది. భూముల రికార్డులన్నీ ట్యాంపర్ చేసి ఈ భూములను ఆయన కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
పెద్దిరెడ్డి భూ అక్రమాలపై చంద్రబాబుకు చేరిన ప్రాథమిక నివేదిక
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయన కుటుంబం పెద్ద ఎత్తున భూముల కబ్జాలకు పాల్పడిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఓ నివేదికను అందించినట్లుగా తెలుస్తోంది. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణి గుంట మండలాల్లో భూరికార్డులు తారుమారు చేసి, బినామీల పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించారు. రెవిన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై స్పందించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవి ధ్వంసంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మంగళం అటవీ భూముల్లో గెస్ట్ హౌస్ - ప్రభుత్వ నిధులతో రోడ్డు
పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతం ఉంది.ఈ అటవీ ప్రాంతం మధ్యలో తమకు ప్రైవేటు భూమి ఉందని పెద్దిరెడ్డి కుటుంబీకులు మధ్యలో ఓ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. మార్కెట్ కమిటీ నిధులతో అక్కడకు తారు రోడ్డు కూడా వేసుకున్నారు. మాముగా అయితే గ్రామాలను కలిపే రోడ్లను వేస్తారు. కానీ ఇక్కడ అటవీ ప్రాంతంలో.. పెద్దిరెడ్డి కుటుంబం నిర్మించిన గెస్ట్ హౌస్ వద్దకు రోడ్డు వేశారు. వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఫోటోలు బయటకు వచ్చాయి.
మదనపల్లి ఫైల్స్ బుగ్గి.. తర్వాత పరిణామాల్లో పెద్దిరెడ్డిపై పలు ఆరోపణలు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబడి కేసులోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే ప్రధానమైన ఆరోపణలు వచ్చాయి. మంత్రిగా ఉన్న మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డారని.. వాటికి సంబంధించిన వివరాలు బయట పడకుండానే ఫైళ్లను తగులబెట్టించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మదనపల్లి ఫైల్స్ తగలబడిన సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ భూ వివాదాలపై ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించింది. భూమి యజమానులకు తెలియకుండా రికార్డుల్లో పేర్లు ఇష్టానుసారం మార్చిన ఘటనలు అనేకం జరిగాయని, వీటిని అరికట్టాలని బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పుడు ఏకంగా అడవిలోనే వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేయడంతో దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: రైలు పట్టాలపై పడుకోబెడతా - జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే