TTD has filed cases against three YouTube channels : తిరుమల తిరుపతి దేవస్థానాలపై అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై మూడు యూట్యూబ్ చానళ్లపై టీటీడీ కేసులుపెట్టిది.  ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త , ప్రభుత్వ సలహాదారు బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావు తిరుమల యాత్రలో ఆయనను టిటిడి అవమానించిందని ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని..ఆ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి 28, 2025న టిటిడి ఫిర్యాదు చేసింది. 


హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి        యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నెం.  13/2025   గా       నమోదైంది.  చాగంటి కోటేశ్వర రావు   తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టిటిడి వెల్లడించినా,  సదరు సోషల్ మీడియా ప్రతినిధులు వారు పదే పదే టిటిడి ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని టీటీడీ చెబుతోంది. దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల పిఐబీ  వారికి కూడా ఫిర్యాదు చేశారు.  


భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వర రావు గారి ఆద్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ వారికి కూడా అధికారికంగా ఫిర్యాదు లేఖ రాశారు.  చాగంటి కోటేశ్వర రావు  జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం టిటిడికి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు   టిటిడి ప్రొసిడింగ్స్ ఇచ్చింది. వారికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులో భాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది. 


అయితే శ్రీవారి చెంత తాను వీఐపీని కాదని..  ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి,  సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకురుకుంటానని చెప్పారు. ఆ ప్రకారమే శ్రీవారిని దర్శించుకున్నారు.  జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన జరిగింది. ఈ కారణంగా చాగంటి వారి  ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టిటిడి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ఆ విన్నపాన్ని  చాగంటి అంగీకరించారు. తదుపరి వారి అనుమతి తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టిటిడి నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాలతో చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ఆ యూట్యూబ్ చానళ్లు ప్రసారం చేశాయి. 


శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా , ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టిటిడి  సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.