ISRO Successfully Launches GSLV F15: ఇస్రో (ISRO) వందో రాకెట్ ప్రయోగం తిరుపతిలోని శ్రీహరికోట వేదికగా బుధవారం ఉదయం జరిగింది. షార్ నుంచి ఉదయం 6:23 గంటలకు శాస్త్రవేత్తలు జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్... ఎన్‌వీఎస్ - 02 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ శాటిలైట్ స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే అన్ని ప్రక్రియలనూ స్వయంగా పర్యవేక్షించారు.










ఎన్‌వీఎస్ 02 ప్రత్యేకతలివే..


ఎన్‌వీఎస్ - 02 ఉపగ్రహం.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ కోసం ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది. అలాగే, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు ఈ ఉపగ్రహపు నావిగేషన్ వాడుకోవచ్చు. భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకూ యూజర్లకు కచ్చితమైన నావిగేషన్ అందిస్తుంది.


ఇస్రో ఛైర్మన్ శుభాకాంక్షలు






ఇస్రో వందో ప్రయోగం సక్సెస్ కావడంపై ఛైర్మన్ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. 'ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది. ఎన్‌వీఎస్ - 02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుంది. ఇప్పటివరకూ 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశాం. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటివరకూ శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా పంపాం. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య, ఎస్ఆర్ఈ మిషన్లు చేపట్టాం.' అని నారాయణన్ వివరించారు.


Also Read: Sri Jaganmohini Kesava Swami Temple : ముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. ఈ విశేష ఆలయం ఏపీలోనే ఉంది!