Guntakallu MLA made harsh comments on media representatives: మీడియా ప్రతినిధులపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెచ్చిపోయారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. గుంతకల్లు పట్టణంలోఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా అంటే తనకు లెక్కలేదన్నారు. తాను రాజకీయాల్లో అన్నీ చేసి వచ్చానని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో చూస్తానని హెచ్చరించారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి కథనాలు రాస్తే సహించేది లేదన్న గుమ్మనూరు జయరాం
తాను తప్పు చేస్తే రాయాలని.. ఆధారాలు లేకుండా రాస్తే ాత్రం తాట తీస్తానని హెచ్చరింతారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించారు. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు.. నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు ..భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు .. వీటన్నింటినీ నిరూపించాలన్నారు. మిడియా ప్రతినిధులతో గుంతకల్లు ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైసీపీలో ఆలూరు నుంచి గెలిచి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం
గుమ్మూరు జయరాం గతంలో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి రెండు సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా కూడా చేశారు. అయితే గత ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లు టిక్కెట్ లభించింది. అక్కడ ఆయనకు పెద్ద ఎత్తున బంధువులు ఉండటం.. టీడీపీ గాలిలో విజయం సాధించారు. అయితే ఆలూరులో ఆయనపై ఎన్నో వివాదాలు ఉండేవి. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి నుంచి మద్యం తేవడం.. పేకాట శిబిరాలు నిర్వహించడం వంటివి చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బెంజ్ కారు ఓ కాంట్రాక్టర్ నుంచి బహుమతిగా తీసుకున్నారని ఆయనను బెంజ్ మంత్రి అని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించేవారు
గుంతకల్లులో ఆయనతో పాటు బంధువుల వ్యవహారంపై పలు ఆరోపణలు
అయితే వైసీపీతో విబేధించిన తర్వాత ఆయన బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ చేర్చుకుంది. ఆలూరులో ఆయనపై వ్యతిరేకత ఉండటంతో ఆయనను గుంతకల్లుకు మార్పించారు. అయితే.. రాష్ట్రం మొత్తం మీద కూటమి ఓడిపోయిన పదకొండు సీట్లలో ఆలూరు కూడా ఒకటి. ఇప్పుడు గుంతకల్లులోనూ గుమ్మనూరు జయరాంపై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో వార్తలు వస్తూండటంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!