Harish Kumar Gupta has been appointed as the new DGP of AP:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయ్తి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైఎస్ కుటుంబానికి విధేయుడు. ఆ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. పైగా ఆయన సమర్థతపై చాలా సందేహాలు ఉన్నాయి.
జగన్ హయాంలోనే ఆయనపై చర్ల్యలు తీసుకున్నారు. ఈ కారణంగా ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. రెండవ స్థానంలో ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా పనిచేస్తున్నారు. హరీష్ కుమార్ గుప్తా రెండో సారి డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికలసంఘం బదిలీ చేసింది. ఆ సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కొంత కాలం ఆయన డీజీపీగా ఉన్నారు.
అయితే మరో సీనియర్ అధికారి ద్వారకా తిరుమల రావు డీజీపీ పదవిలోకి రాకుండానే రిటైరయ్యే పరిస్థితులు ఏర్పడటంతో ఇరువురికి అవకాశం కల్పించేలా చంద్రబాబు మధ్యలో హరీష్ కుమార్ గుప్తా స్థానంలో ద్వారకా తిరుమలరావుకు చాన్సిచ్చారు. ఇప్పుడు ఆయన రిటైర్ కావడంతో మళ్లీ గుప్తాకు అవకాశం కల్పించారు. డీజీపీగా ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావును పదవీ విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీజీపీగా ఉంటూనే ఆయన ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్నారు.
హరీష్ కుమార్ గుప్తా పదవి కాలం ఆగస్టు వరకూ ఉంటుంది. ప్రస్తుతం కావాలని అనుకుంటే మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం నూతన డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూల్స్ మేరకు అన్ని అర్హత ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్ట్‌ను ప్రభుత్వం యూపీఎస్సీకి రిఫర్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ముగ్గురు అధికారులతో కూడా జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా వారిలో ఏ ఒక్కరికీ డీజీపీగా అవకాశం ఇవ్వకుండా జూనియర్లకు ఆ పదవిని ఎలా కట్టబెడతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున .. అక్కడే పిటిషన్ వేయాలని హైకోర్టు సూచిస్తూ పిటిషన్ తోసి పుచ్చింది. దీంతో న్యాయపరమైన చిక్కులు కూడా డీజీపీ నియామకానికి లేవు.