former Minister Peddireddy said that the land in Mangalam forest area is not forest land : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం 75 ఎకరాలు భూములు ఆక్రమించిందని వచ్చిన ఆరోపణలపై మాజీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అవి అటవీ భూములు కాదన్నారు. తాము ఇరవై ఏళ్ల కిందటే వాటిని ఆ భూములు యజమానుల వద్ద కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నామన్నారు. అప్పట్లోనే అక్కడ పని చేసే వారి కోసం నిర్మాణాలు చేశామన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ  భూమిని అటవి భూమ అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ భూములు అటవీ భూములు కాదని గతంలో అధికారులు కూడా నిర్ధారించారని కూడా తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన పత్రికపై తాను ఇప్పటికే యాభై కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశానన్నారు. ఆ భూములు అడవి మద్యలో ఉన్నప్పటికీ.. ప్రైవేటు భూములేననడానికి అన్ని రికార్డులు ఉన్నాయని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. 

తనపై పలు రకాల ఆరోపణలు చేస్తున్నారని కానీ నిరూపించడం లేదన్నారు. మదనపల్లి ఫైల్స్ తగలబడిన కేసులో తనపై ఆరోపణలు చేశారన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇసుక స్కామ్ లో పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేశారని ఆరోపణుల చేశారని ..కానీ ఇప్పటి వరకూ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. అలాగే నేపాల్‌లో ఎర్రచందనం దొరికితే.. అది కూడా పెద్దిరెడ్డిదే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫారెస్ట్ మంత్రి.. ఉప ముఖ్యమంత్రి అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 

అటవీ ప్రాంతంలో  అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించిన అంశంపై పెద్దిరెడ్డి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అక్కడ పని చేసే వారి కోసం అక్కడ నిర్మాణాలు చేశామన్నారు. కొత్తగా చేసిందేమీ కాదన్నారు. అయితే అక్కడ భారీ గెస్ట్ హౌస్ ఉందని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఆ అటవీ ప్రాంతంలోని గెస్ట్ హౌస్ వద్దకు.. ఫామ్ హౌస్‌లోకి మార్కెట్ కమిటీ నిధులతో రోడ్లు వేసుకున్నారన్న ఆరోపణలపై కూడా పెద్దిరెడ్డి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇలాంటి ప్రచారంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

మరో వైపు పెద్దిరెడ్డి కుటుంబం పలు చోట్ల   ఈ తరహా భూకబ్జాలకు పాల్పడిందన్న ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరినట్లుగా తెలుస్తోంది.  ఈ  అంశంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.                  

Also Read: రైలు పట్టాలపై పడుకోబెడతా - జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే