Talakona Waterfalls Near Tirupati Telugu News: తిరుపతి: ఆకాశాన్నంటే ఎత్తైన పర్వతాలు.. ఏటవాలు లోయలు.. చుట్టూ పచ్చందనంతో పులకరించే దట్టమైన అడవి.. ప్రకృతి ఒడిలో నుంచి జాలువారే జాలపాత సోయగం. నయనానందాన్ని కలిగించే ఆ సెలయేటి సప్పుళ్లు.. వినసొంపుదగ్గ పక్షుల కిలకిల రావాలు... అంతటి ఆహ్లాదం ఇంకెక్కడా దొరకని ప్రకృతి సౌందర్యం తలకోనకే సొంతం.. శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు, ఔషదాలు, అబ్బుర పరిచే ప్రకృతి వింత, అనేక వృక్ష, పక్ష, జంతు జాతులు తలకోనలో ప్రత్యక్షమవుతాయి. అతిధి గృహాలు, షూటింగ్‌స్పాట్, ఆటస్థలం, ఈతకొలను వంటివి తలకోనలో మాత్రమే ఉన్నాయి.. పచ్చని చెట్లతో తలకోన ప్రకృతి పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటుంది...
తలకోన అటవీ ప్రాంతం భాకరాపేట చామల రేంజ్ పరిధిలో మొత్తం 27,228 హెక్టార్ల విస్తీర్ణం లో ఉంది. 178 రకాల పక్షి జాతులు, 342 రకాల అరుదైన జంతుజాతులతో పాటు చిత్ర విచిత్రమైన జంతువులు, పక్షులు తలకోన అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయు. దక్షిణ భారతదేశ అడవుల్లో అంతుపట్టని ఆశ్చర్యకర, ఆసక్తికర ప్రకృతి అందాన్ని ఇక్కడ మాత్రమే ఆశ్వాదించవచ్చు. శేషాచలంలో భాగమైన తలకోన అటవీ ప్రాంతం ఎన్నో ఎన్నెన్నో వింతలు, విశేషాలు, అధ్బుతాలు, చారిత్రక అంశాలను మీరు కూడా తెలుసుకోండి...
సంతాన ప్రదాత ఈ సిద్దేశ్వర స్వామి
తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ పిల్లుల లేని దంపతులు స్వామి, అమ్మవార్లకు వరపడితే సంతానం కలుగుతుంది ప్రసిద్ధి. ప్రస్తుతం పూజించే సిద్దేశ్వరాలయం ఉదయమానఖ్యంకి చెందిన అప్పస్వామి 1811లో కట్టించారని స్థల పురాణం. దానికి ముందు జలపాతమార్గంలో రామలక్షణ వృక్ష్యాల సమీపంలో కనుమ మార్గంలోని సిద్దప్ప(అప్పస్వామి) గుహల్లో వికారినామ సంవత్సరం, మార్గశిర శుద్ధ ద్వాదశిన చిన్నగుడి ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్వం సిద్ధమునులు ఇక్కడ తపస్సు చేసినట్టుగా గుర్తించబడే దేవతామూర్తుల సర్పం, ఏనుగుల లాంటి పవిత్ర జంతువుల బొమ్మలు, రాత్రిల్లో వెలుతురు కోసం దేవతలకు దీపారాధకు గుహలలోని పేటులకు చెక్కిన దీగూడులు ఉన్నాయి. దీనిని రుజువు చేసే తెలుగు శాసనం కూడా ఈ గుహలో గుర్తించవచ్చు. ఆ కాలంలో జలపాతన స్నానాలు ఆచరించి ఇక్కడే సిద్దేశ్వరున్ని దర్శిచుకునే వారట. నేటికి అప్పుడు చెక్కిన మెట్లమార్గం ఆనవాళ్లు ఉన్నాయి. ఈ సిద్దప్పగుహలోని శివయ్య దర్శనం అనంతరం ఈ మార్గం గుండా చుట్టు పక్కల గ్రామస్తులు కాలి నడకతో తిరుమలకు చేరుకునే వారని పెద్దలు చెబుతున్నారు.
ఆదిమానవుని ఆనవాళ్లు..
తలకోన అటవీ ప్రాంతంలో ఆదిమానవుడు నివశించినట్లు అనేక ఆనవాళ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆదిమానవుని కాలంలో ఆవాసాలు, జీవన విధానాలు వెలుగులోకి వచ్చాయి. ఆదిమానవుడు ఉపయోగించిన రాతి, చేతి గొడ్డల్లు, ఉత్తర శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగానికి చెందిన రేఖా చిత్రాలను కూడా తలకోన అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ రేఖా చిత్రాలను రుద్రగళతీర్థం, మొగిలిపెంట, పులగూరపెంట ప్రాంతాల్లో గుర్తించారు.
శిరోద్రోణ తీర్ధం
శేషాచలంలో ఉన్న తీర్థాల(పవిత్ర జలపాతం)కంటే ఎతైనది, సుందరమైనది తలకోన ఒక్కటే. కోనలకే తలమానికం కాబట్టి తలకోన పేరు వచ్చినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. పురాణాల్లో చూస్తే శ్రీ వెంకటేశ్వరస్వామి చేసిన అప్పును తీర్చడానికి గోవిందరాజస్వామి ముంతలతో కొలచి అలసి తలవాల్చి ముంతను తలగడచేసుకొని పడుకున్నాడు కాబట్టి తలకోన అని పేరు వచ్చినట్లు వర్ణిస్తుంటారు. తల.. కోన భాగం నుంచి వస్తోంది కనుక శిరోద్రోణ తీర్థం అనికూడా పిలుస్తారు. 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటికీ వీడని మిస్టరీ. దట్టమైన అటవీ ప్రాంతం, ఎల్తైన జంట పర్వతాల మద్యన అనేక వనమూలికలు, చెట్లు వేర్ల నుంచి జాలువారుతున్న ఈ నీళ్లలో మునిగితే అనేక రోగాలు నయమైతాయని నమ్మకం. క్రీ.శ. నుంచి ఈ జలపాతం ప్రసిద్ధిలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయులు 8సార్లు తిరుమలను దర్శించుకోగా ఒక్కసారి తలకోన జలపాతంలో పుణ్య స్నానాలు ఆచరించి కాలినడకన తిరుమలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ జలపాతాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
అడివంతా అల్లుకు పోయే తీగజాతులు
తల వెంట్రుకల సుడుల వలే తలకోన అడవుల్లో తీగజాతి వృక్ష్యాలు అడివంతా అల్లుకొని ఉన్నాయి. వింతైన ఆకారాలతో తీగలు కనిపిస్తాయి. చెట్టుకు చెట్టు అతుక్కొని అన్నదమ్ములాగా కనబడుతాయి. నెలకోనకు వెళ్లే మార్గంలో రామలక్ష్మణ వృక్ష్యాలు ఒకేఎత్తుతో ఒకే వెడల్పుతో దర్శన మిస్తాయి. మరి కొన్ని చెట్లకు పరమేశ్వరుని మేమలోని సర్పం వలే వంకర్లుగా ఇక్కడి చెట్లు ఉన్నాయంటే సిద్దేశ్వరుని మహిమే అంటు చెట్లను చూసిన శివభక్తులు విశ్వసిస్తుంటారు.
గిల్లతీగ(తిప్పతీగ) తలకోనలో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. ఇది లయనాసి జాతికి చెందినదిగా పరమ దివ్య ఔషద వృక్ష్యంగా పిలుస్తారు. 260సెంటిమీటర్ల చుట్టుకొలతతో 5కిలోమీటర్ల మేరా ఉంటుంది. దీని వయస్సు 300ఏళ్లుగా చెబుతారు. అగ్గిపుల్లలు, నసింపొడిలకు దీని బెరడును ఉపయోగిస్తారు. ఈ తీగ మొదలు ఎక్కడుందో కొన ఎక్కడుందో ఎవ్వరికీ అంతుచిక్కదు. ఎక్కవగా ఈ తీగ నెలకోన మార్గంలో దర్శనమిస్తుంది. అదే మార్గంలో బాటలకు అడ్డంగా ఉన్న గిల్లితీగలను అకస్మాత్తుగా చూస్తే అనుకొండపాము పాలిక కలిగి ఉంటుంది. గిల్లితీగను జలపాతానికి వెళ్లే మార్గంలో కోర్కెలు కోరి ఈ చెట్లకు ముడుపులు కడితే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం.
షూటింగ్ స్పాట్: తలకోన షూటింగ్ స్పాట్‌లకు ప్రసిద్ధి గాంచింది. నెరబైలుకు చెందిన దివంగత నటుడు టెలిఫోన్ సత్యనారాయణ ఇక్కడి ప్రకృతి అందాలను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వందల సంఖ్యలో తమిళ, తెలుగు, కన్నడ, మళయాల, హింధీ చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ప్రముఖ దర్శఖుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అన్వేషణ సినిమా చిత్రీకరణ దాదాపుగా ఇక్కడే పూర్తి చేశారు. చిరంజీవి నటించిన ఖైధీ చిత్రం కూడా ఇక్కడ చిత్రీకరించిందే. 80వ దశకం నుంచి చిరంజీవి చిత్రాల్లో తప్పనిసరిగా తలకోన ఉండేది.చిత్తూరు జిల్లాకు చెందిన నటుడు మోహన్‌బాబు తన సినిమాల్లోని సన్నివేశాలను ఎక్కువగా ఇక్కడే తీస్తుంటారు. టీవీ షూటింగ్‌లు అయితే లెక్కలేనన్ని ఇక్కడ జరుగుతుంటాయి. తలకోన ప్రస్తుతం ఓ తమిళ సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతున్నది.
అతిథి గృహాలు: తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అతిధిగృహాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 12 గదులు ఉన్నాయి. ఒక్కొ గదె అద్దెకు రూ.250చొప్పున దొరుకుతుంది. పొగ, మద్యం, మాంసాహారం ఇక్కడ నిషిద్దం. ఈ గదులకు పూర్తిగా పట్టిష్ట బందోబస్తు నడుమ ఉంటుంది. తలకోనకు వచ్చే భక్తుల కోసం ఆలయ అతిధి గృహాలు 15 అందుబాటులో ఉన్నాయి. రూ.500 చొప్పున అద్దెకు ఇస్తుంటారు. ఈ గదులు పూర్తిగా ఆలయ కార్యనిర్వహనాధికారి పర్యవేక్షనలో ఉంటాయి. అటవీ శాఖ అతిధిగృహాలు తలకోనకు ప్రారంభంలోనే ఉంటాయి. దీనినే ఇకో టూరిజం అనికూడా అంటారు. అహ్లాదకరమైన పచ్చని చెట్ల మద్యలో ఈ అతిధి గృహాలు నిర్మించారు. ఈ రూములను ‘శేషాచల వనదర్శిని’ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద మాజీ చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ సిద్దరామిరెడ్డి జ్ఞాపకార్థం అన్నదాన సత్రాన్ని సుమారు కోటి రూపాయలతో నిర్మించారు. ప్రతి రోజు మద్యాహ్నం ఇక్కడ ఆలయ దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు.
తలకోనకు చేరుకోవడం ఇలా...
తిరుపతి– మదనపల్లి జాతీయ రహదారిలోని భాకరాపేట నుంచి తలకోన మార్గం ఉంది. తిరుపతి నుంచి తలకోనకు ఉదయం, మధ్యాహ్నం రెండు బస్సుల సౌకర్యం ఉంది. పీలేరు నుంచి వచ్చేవాళ్లు భాకరాపేటకు చేరుకొని అక్కడ నుంచి టాక్సీలు, ఆటోలల్లో తలకోనకు చేరుకోవచ్చును. పీలేరు డిపో నుంచి కూడా రెండు బస్సుల ఉన్నాయి.