Pension Distribute At Home in Andhra Pradesh | పుట్టపర్తి: జులై ఒకటో తేదీన ఇంటి వద్దనే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఇంటివద్దనే పింఛన్లు పంపిణీ చేపడుతున్నామని ఏపీ బీసీ, చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత చెప్పారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పెనుగొండ నియోజకవర్గానికి వచ్చిన టీడీపీ నాయకురాలు సవితకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.


అన్ని రంగాలలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం 
బెంగళూరు విమానాశ్రయం నుంచి వయా సోమందేపల్లి, పెనుగొండ పట్టణము వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా మంత్రి సవిత ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేనేత కార్మికుల బతుకుల్లో అభివృద్ధి వెలుగులు విరజిల్లుతాయన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, రాయితీ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  


ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు 
తనపై నమ్మకం ఉంచి మంది పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఇచ్చిన బీసీ సంక్షేమం, చేనేత జౌళిశాఖ మంత్రి శాఖలలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు. త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశామన్నారు.




ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై సంతకాలు చేశాం, ఇక వాటిని అర్హులకు వర్తింజేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. తాను సైతం వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 


చేనేత కళాకారులు, హస్త కళాకారులకు సబ్సిడీలు 
2014-19 సమయంలో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఏడు వేల రూపాయలు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని చంద్రబాబు నాయకత్వంలో నెరవేరేస్తామని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు.