Media Legend Ramoji Rao Memorial Event In AP: మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న (గురువారం) పెనమలూరు మండలంలోని తాడిగడప - ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఎదుట గల ఖాళీ స్థలంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీరావు, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో పాటు షార్ట్ ఫిలిం ప్రదర్శన కార్యక్రమాలను  నిర్వహించాలని మంత్రి అధికారులకు నిర్దేశించారు. 


సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు నిర్దేశించారు. వీవీఐపీలకు, సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రతి గ్యాలరీకి ఇంఛార్జీలను నియమించాలన్నారు. ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బారికేడింగ్స్ ఏర్పాటు చేయాలని.. ప్రధాన వెన్యూ రహదారులు మరమ్మతులు చేయాలని ఆర్అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రధాన వెన్యూకు వచ్చే మార్గాల్లో తగు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు, వీవీఐపీలకు చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, నాన్ వీఐపీలకు, సాధారణ ప్రజానీకానికి వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా పవర్ బ్యాక్ అప్ ఏర్పాటు చేయాలన్నారు.


పార్కింగ్ ప్రదేశాల పరిశీలన


అనంతరం పార్కింగ్ ప్రదేశాలను మంత్రి పార్థసారథి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాష, సమాచార శాఖ అదనపు డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు కిరణ్ కుమార్, కస్తూరి, సీఈ మధుసూదన్, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ వాణి, కృష్ణా జిల్లాలో వివిధ శాఖల అధికారులు, ఉయ్యూరు ఆర్డీఓ డి.రాజు తదితరులు పాల్గొన్నారు.