CBI registers FIR in paper leak in NEET 2024| న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో అవకతవకలపై సీబీఐ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ 2024 ఎగ్జామ్ ఫలితాలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశంపై కేసు నమోదు చేసింది. ఇదివరకే యూజీ నెట్ పేపర్ లీక్ పై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.
నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో 1,563 మంది అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ ఆదివారం నిర్వహిస్తున్నారు. జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపిన వివరా ప్రకారం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్టీఏ అధికారులు సైతం ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంటారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మేఘాలయ, హర్యానా, మరియు చండీగఢ్‌లోని ఆరు కేంద్రాలలో ఎగ్జామ్ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో గ్రేస్ మార్కులు తొలగించడంతో పాటు రీ ఎగ్జామ్ నిర్వహించారు.
నీట్ పీజీ ఎగ్జామ్ రద్దు..
దేశంలోకి మెడికల్ కాలేజీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 23న నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే నీట్ యూజీ పేపర్ లీక్, నెట్ పేపర్ లీకుల సమస్య ఉండటంతో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ను కేంద్రం వాయిదా వేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అవకతవకలు, పేపర్ లీకుల బెడద లేకపోతే ఆదివారం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో నీట్ పీజీ- 2024 పరీక్ష జరిగేది.
Also Read: NTA New Chief: నీట్, నెట్ పేపర్ లీక్ ఎఫెక్ట్ - ఎన్‌టీఏ చీఫ్ పై వేటు, కొత్త డీజీగా విశ్రాంత ఐఏఎస్
యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు
జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్ష ఇదివరకే రద్దు చేశారు. ఎగ్జామ్ నిర్వహించిన మరుసటి రోజే.. జూన్ 19న కేంద్ర ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, వివాదం మొదలయ్యేలోపే దీనికి చెక్ పెట్టడానికి.. పారదర్శకత కొనసాగించడానికి ఎగ్జామ్ రద్దుచేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.