Diarrhea Cases Increased In Jaggayyapeta: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కలకలం రేపుతోంది. అతిసారతో తీవ్ర అస్వస్థతకు గురైన ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనే 50 మందికి పైగా డయేరియా లక్షణాలున్న రోగులుండగా.. 8 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యాధికారులు డయేరియా నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 


అధికారులు అలర్ట్ 


డయేరియా విజృంభిస్తోన్న క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వాస్పత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్, జేసీలు జగ్గయ్యపేటలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు, వ్యాధి తీవ్రత దృష్ట్యా జగ్గయ్యపేటలో రెండు రోజుల పాటు చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం విధించారు.


మంత్రి పరామర్శ


డయేరియా వ్యాప్తి క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జగ్గయ్యపేటలో పర్యటించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జగ్గయ్యపేట పరిధిలోని మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయని.. ఇప్పటివరకూ అధికారికంగా 58 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రధానంగా నీటి సమస్య వల్లే డయేరియా విస్తరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.


నీటి సమస్యే కారణమా.?


గ్రామాల్లో డయేరియా విజృంభణకు నీటి సమస్యే కారణమని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 8 చోట్ల డయేరియా కేసులు బయటపడ్డాయని చెప్పారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని.. నీటిలో క్లోరిన్ శాథాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. 


Also Read: Telugu Youth Died: అమెరికాలో కాల్పులు - తెలుగు యువకుడు దుర్మరణం