Warangal News: మారుమూల గ్రామం, నిరుపేద కుటుంబం నుండి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు ఓ క్రీడాకారుడు. అయితే అతను చెవిటి, మూగ. విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ రాజు.. బధిర, మూగ క్రీడాకారులతో నిర్వహించే ఐపీఎస్‌ కోసం హైదరాబాద్ టీంకు ఎంపికైయ్యాడు. గల్లి నుండి జాతీయ స్థాయి క్రికెట్ లోకి వచ్చిన రాజు భూపాలపల్లి జిల్లా పెద్దంపల్లి గ్రామానికి చెందిన వాడు.


సైగలు చేస్తూనే పసుల రాజు మరొకరితో కమ్యూనికేట్ అవ్వగలడు. పుట్టుకతో చెవిటి, మూగవాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం కావడంతో పదవ తరగతి పూర్తి చేశాడు. అయితే రాజుకు చిన్ననాటి నుండి క్రికెట్ అంటే తెగ పిచ్చి. గల్లి క్రికెట్ నుండి ఎదిగిన రాజు ఇంటర్ చదువుతూనే అంతర్ జిల్లా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడారు. ఇంటర్ తరువాత టీ 20 మ్యాచ్ లు ఆడాడు. రాజు ఫాస్ట్ బౌలర్ తోపాటు బ్యాట్స్ మెన్. ఇతను ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రతిభ కనబర్చేవాడు. పుట్టుకతో చెవిటి , మూగ కావడంతో రాజు ప్రతిభను గమనించిన తెలంగాణ చెవిటి, మూగ క్రికెట్ అసోసియేషన్ కోచ్ రాజారాం 2022 నుండి హైదరాబాద్ లో కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే రాజారాం కూడా చెవిటి, మూగనే. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల చెవిటి, మూగ క్రికెట్ అసోసియేషన్ లు నిర్వహించిన మ్యాచ్ ల్లో అనేక మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించారు. 




2025 మార్చిలో జరిగే చెవిటి, మూగ ఐపీఎల్ టోర్నమెంట్ కు జరిగిన క్రీడాకారుల ఎంపికలో రాజు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కు ఎంపికయ్యాడు. ఈ టీంలో క్రీడాకారులంతా హైదరాబాద్ వాళ్ళు కావడం, ఒక్క రాజు మాత్రం వరంగల్ కావడం విశేషం. దీంతో రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లకు వెళ్లనున్నారు. రాజు ఐపీఎల్ కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే ఇష్టమని తల్లిదండ్రులు చెప్పారు. మాటలు రావని బాధపడే వాళ్ళమని తల్లి చెప్పింది.




గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉండే రాజు ఐపీఎల్ కు ఎంపిక కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆడి గ్రామానికి పేరు తెస్తాడని ఎప్పుడు అనుకోలేదని స్నేహితులు, గ్రామస్తులు చెబుతున్నారు. రాజుకు క్రికెట్ అంటే పిచ్చి అని స్నేహితులు చెప్పారు. రాజు పేద కుటుంబం నుండి ఎదుగుతున్న క్రికెటర్ కాబట్టి ఆర్థికంగా సహాయం చేయని కోరుతున్నారు.
   
అయితే రాజు కూడా ఐపీఎల్ కు సెలెక్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రుల కష్టానికి ఫలితం అని ఆయన సైగల్లో చెప్పారు. మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతానని రాజు తెలిపారు. రాజు అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగి మంచి విజయాలు సాధించాలని గ్రామస్తులు స్నేహితులు కోరుకుంటున్నారు.