కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఇస్రో సైంటిస్ట్ బృందం దర్శించుకుంది. ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో సైంటిస్ట్ బృందం సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంది.
14వ తేదిన పీఎస్ఎల్వీ సి-52 లాంచింగ్ చేపట్టనున్నారు. అందుకే ముందుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని సందర్శించుకొని పూజలు చేశారు. PSLVసి-52 నమూనాను శ్రీవారి మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేల పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు PSLVసి-52 నమూనాకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఇస్రో సైంటిస్ట్ బృందానికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ఏడాది మొదటి రాకెట్ ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. ఈ నెల 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దీన్ని నింగిలోకి పంపిస్తారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి 52(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌక ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
నాలుగు దశల అనుసంధానం పూర్తి చేసి ఆ తర్వాత ఉష్ణకవచం అమర్చారు. అనంతరం వివిధ పరీక్షలు జరిపి రిహార్సల్స్, ప్రీ కౌంట్ డౌన్ నిర్వహిస్తారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ సాగుతుంది. ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ ప్రయోగిస్తారు.
పీఎస్ఎల్వీ సి-52 ద్వారా ఆర్‌ఐశాట్-1ఎ (ఈవోఎస్-04)తోపాటు ఐఎన్‌ఎస్-2టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్ -1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈఓఎస్-04 శాటిలైట్ బరువు 1710 గ్రాములు. ఇదో రేడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఎటువంటి వాతావరణంలోనైనా ఇది హైక్వాలిటీ ఇమేజ్‌ను తీసి పంపిస్తుంది.
వ్యవసాయం, అటవీ, మొక్కల పెంపకం, నేల సాంద్రత, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ లాంటి అప్లికేషన్లకు ఈ శాటిలైట్ వాడతారు. మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటైన ఇన్స్పైర్ శాట్-1ను యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది.