Appalamm Dosa: తిరుపతి(Tirupati) ఆధ్యాత్మిక నగరానికి రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు. ట్రైన్ ప్రయాణం చేసే వారికి ముందు రేణిగుంట రైల్వే స్టేషన్ స్వాగతం పలుకుతుంది. అందుకే తిరుపతికి వచ్చే యాత్రికులకు రేణిగుంట అంటే తెలియకుండా ఉండుదు. రైల్వేస్టేషన్‌కి కూతవేటు దూరంలో ఓ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా కిటకిటలాడుతూ ఉంటుంది.
రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న టిఫిన్ సెంటర్ ఆమాత్రం రద్దీ ఉండదా అని మాత్రం అనుకోకండీ. ప్రతి రైల్వే స్టేషన్ వద్ద ఉండే టిఫిన్ సెంటర్‌లో కనిపించే రద్దీ కాదు. ఇక్కడ లభించే ఓ స్పెషల్ టిఫిన్ కోసం జనం ఎగబడతారు. సన్నని సెగపై కాల్చే అప్పం దోశ(Appam Dosa) ఇక్కడి ప్రత్యేకత. ఈ అప్పం దోశలే వీరికి ఎంతో పేరును తెచ్చి పెట్టింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ లో అప్పం ఎంతో ఫేమస్. అలాంటి అప్పం రేణిగుండ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా దొరుకుతుంది. అందుకే జనం ఎగబడి మరీ తింటా ఉంటారు.
మారిన పరిస్థితులతో టిఫిన్ సెంటర్స్‌లో గ్యాస్ పొయ్యి మీద టిఫిన్ తయారు చేస్తుంటారు. కానీ రేణిగుంటలో మాత్రం కట్టెల పొయ్యి మీదనే దోశలు వేస్తారు. చూడటానికి చాలా చిన్నగా ఇరుగ్గా కనిపించినా ఈ టిఫిన్ సెంటర్‌లో మాత్రం దోశలు అదుర్స్ అని చెప్పొచ్చు. అందుకే నోటిమాటతోనే ఈ సెంటర్ ఫేమస్ అయిపోయింది. రేణిగుంటలో అప్పాలమ్మ హోటల్ అంటే తెలియని వారు ఉండరు.
ఇక్కడ ఎన్ని రకాల అప్పాలు దొరుకుతాయంటే...???
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ఈ అప్పం దోశలు దొరుకుతాయి.. ఇక్కడ సాదా అప్పం, కరివేపాకు అప్పం, కారం అప్పం, కోడిగుడ్డు అప్పం, మిరియాల పొడి అప్పం, పప్పులపొడి అప్పం ఇలా రకరకాల అప్పాలు దొరుకుతాయి. ఈ హోటల్ లో మరోక ఫేమస్ వంటకం కూడా ఉందండోయో.. అదేదో కాదు చికెన్, మటన్, పాయా, నాటుకోడి, బోటీ, తలకూర వంటి రకాల మాంసాహారం కూడా ఈహోటల్‌కి వచ్చే వారు అందుబాటులో ఉంటుంది..
ఈ దోశ తినేందుకు ఎవరెవరు వస్తారో తెలుసా...??
రేణిగుంట అప్పం దోశ అంటే సామాన్యుల నుంచి సినీ స్టార్స్ వరకూ ఫ్యాన్స్ ఉన్నారు అంటే నమ్ముతారా.. మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్‌కి రేణిగుంట ఆప్పం దోశ అంటే ఎంతో ఇష్టం అంటా.. అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ (Rakulpreet) కూడా ఈ అప్పం దోశ రుచి చూశారు. ఎప్పుడూ తిరుపతికి వచ్చినా కచ్చితంగా పొయ్యిపైన వండే ఈ అప్పం దోశ రుచి చూడనిదే వెళ్ళరు. ముఖ్యంగా తిరుపతి, రేణిగుంట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, చిత్తూరు నుంచి ఎక్కువ మంది వచ్చి అప్పం దోశను రుచి చూసి స్నేహితులు,బంధువులకు పార్సెల్ తీసుకెళ్తుంటారు.
అప్పం దోశ ఎప్పటి నుంచి ఫేమస్ అంటే..??
తమిళనాడు నుంచి కొన్ని ఏళ్ళ క్రితం బతుకు తెరువు కోసం రేణిగుంటకు వచ్చి స్ధిరపడిందీ కుటుంబం అయితే ఈ కుటుంబీకులు తొలుత వ్యవసాయం చేసేవారు.. తదనంతరం ముప్పై ఏళ్ళ ముంది జీవనోపాధి కోసం చిన్నగా హోటల్ పెట్టారు.. అందరి లాగా కాకుండా స్పెషల్ వంటతో ఆకట్టుకోవాలని అనుకుని అప్పం దోశను తయారు చేయడం మొదలు పెట్టారు. కారం, పసుపు, గరం మసాలా, చికెన్, మటన్ మసాలాలు ఇంటిలోనే తయారు చేయడం ఇక్కడ స్పెషల్.. దీనికి తోడు పొయ్యి మీద సన్నటి మంటతో దోశ పోసి దాని మీద కాస్త నెయ్యి వేసి వేడి వేడిగా చికెన్, మటన్, ఫ్రై వేసుకొని చల్లటి ఫ్యాన్ కింద ఆపం తింటే ఆహా ఉంటుంది బాసూ.. చెప్పడానికి మాటలు చాలవనుకో. మళ్లీ మళ్లీ రేణిగుంట అప్పంను రుచి చూడాలని అనిపిస్తుంది. ఒకసారి తిన్నారంటే మాత్రం కచ్చితంగా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.