History of Sri Kodanda Rama Swamy Temple in Tirupati- తిరుపతి: రామాలయాలలో మనం సీతారాములు, లక్మణ, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటాము. ఎక్కడ చూసినా రాముడికి ఎడమ వైపు సీతమ్మ కొలువై దర్శనం ఇస్తుంటారు. కానీ సీతమ్మ రాముల వారికి కూడి వైపున ఉండటాన్ని ఎక్కడైనా చూశారా. తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. నగరం నడిబొడ్డున కొలువైన శ్రీ కోదండరామాలయంలో మనం ఓ ప్రత్యేకతతో దర్శించుకోవచ్చు. మూలవర్లుగా శ్రీరాముడు, కుడి వైపున సీతమ్మ, ఎడమ వైపున లక్ష్మణ స్వామి ఆలయానికి ఎదురుగా అభయ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు.


ఆలయ చరిత్ర
శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమవ్వడం కోసం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించారని భవిష్యోత్తర పురాణంలో తెలుస్తుంది. దానికి గుర్తుగా జాంబవంతుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించారని తర్వాత కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించాలని సవాల్ జవాబు పట్టీలో ఈ ఆలయం గురించి ఆధారాలు ఉన్నాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. క్రీస్తు శకం 1402లో నరసింహ ఉడయ్యర్ ( మొదలియార్) ఈ ఆలయాన్ని నిర్మించారని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కూరత్తాళ్వార్ మండపం ఉత్తర గోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది.  ఈ ఆలయ శిల్పకళా పూర్తిగా విజయనగరం కాలంనాటి గా గుర్తించవచ్చు. ప్రతి స్తంభంపై కూడా అనేక భగవత ఘట్టాలు, రామాయణ ఘట్టాలు, దేవతామూర్తులు దర్శనమిస్తాయి. 


తిరుమల శ్రీవారి ఆలయంలోని పంచ భేరాలలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల అమరిక.. తిరుపతిలోని కోదండ రామాలయంలో మూలమూర్తుల అమరిక ఒకేలా ఉండడం ఇందుకు తార్కాణంగా చెబుతారు. ఆలయంలో కొలువైన శ్రీ రాములవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలా దర్శనం ఇవ్వడం ఇక్కడి మరో ప్రత్యేకత.


17 నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.


18న తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. ఈ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8-30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 


20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది. 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.