Pawan Kalyan: జనసేనపార్టీ కార్యకర్త కొట్టే సాయి పట్ల శ్రీకాళహస్తి సీఐ అమానుష వ్యవహారశైలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డిని కోరారు. పవన్ కళ్యాణ్ పిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాంమని హామీ ఇచ్చారు. ఇటీవల్ల వాలంటీర్ వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ ను ఎస్పీ వివరణ కోరారు. వాలంటీర్ వ్యవస్థపై తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసు వ్యవస్థకు సమర్పించాలని అన్నారు. పవన్ కల్యాణ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయం వద్ద అభిమానుల మధ్య తోపులాట జరుగగా.. పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. 






ఇటీవలే తిరుపతి వచ్చే ఆ విషయం తేల్చుకుంటానని చెప్పారు. అన్న మాట ప్రకారమే ఆయన ఈరోజు తిరుపతికి చేరుకున్నారు. భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేశారు. అయితే ముందుగా పవన్ కల్యాణ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు చిలకం మధుసూదన్ రెడ్డి, కిరణ్ రాయల్, రాందాస్ చౌదరి, జె. రాజారెడ్డి, వినుత కోట, అకేపాటి సుభాషిణి, పొన్న యుగంధర్, తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, టి.సివరుణ్ తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు. 






అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ వెంటే ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం నుంచే పార్టీ నాయకులతోపాటు జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.


నేను అంటే ఏంటో చూపిస్తా సీఐ అంజూ యాదవ్‌ కు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో జనసేన చాలా ప్రశాంతంగా ఆందోళన చేసిందన్నారు. కానీ ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చెయ్యి చేసుకున్నారు, సీఐ ప్రవర్తన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. జనసైనికులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మచిలీపట్నం సభలో చూశామన్నారు. ఈ విషయంపై హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు కూడా ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. భవిష్యత్‌లో అందరికీ ఇదొక గుణపాఠం లాంటిది మేము కూడా క్రమశిక్షణతో ఉంటాం అన్నారు పవన్ కళ్యాణ్.






సీఐ అంజూ యాదవ్‌కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు


జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సదరు సీఐకి నోటీసులు జారీ చేసింది. సమోటోగా కేసు నమోదు చేసుకొని ఈనెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.


పవన్ కల్యాణ్‌పై వాలంటీర్లు చేస్తున్న నిరసనకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలు ఆందోళన చేపట్టారు.  పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ అంజూ యావద్.. జనసేన నాయకుడు కొట్టె సాయిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న వారు ఈ వీడియోను తీసి నెట్టింట పెట్టారు. క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.