Nara Lokesh Yatra: చిత్తూరు జిల్లాలోని శాంతిపురం సండే మార్కెట్ లో నారా లోకేష్ పర్యటించారు. అక్కడ ఉన్న ప్రజలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారితో కలిసి మాట్లాడారు. అక్కడే పని చేస్తున్న వారి ఇబ్బందుల గురించి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అంటూ ప్రజలు తమ ఆవేదనను లోకేష్ తో చెప్పుకున్నారు. అయితే సండే మార్కెట్ ను రోడ్డు మీద నిర్వహిస్తున్నారని.. మార్కెట్ నిర్వహణకు స్థలం కేటాయిస్తే బాగుంటుందని ప్రజలు లోకేష్ కు చెప్పారు. కొబ్బరి బొండాలు అమ్మే ఓ దివ్యాంగుడు నాగరాజుని కలిసిన లోకేష్.. అతడితో కాలేపు ముచ్చటించారు. ట్రై సైకిల్ లేక తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని నాగరాజు లోకేష్ దృష్టికి తీసుకొచ్చాడు. స్పందించిన ఆయన.. నాలుగు రోజుల్లో ట్రై సైకిల్ పంపిస్తానని హామీ ఇచ్చారు.
శాంతిపురంలో ప్రజలతో నారా లోకేష్..
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతిపురంకి ఏం చేశారని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని చెత్త ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ సుజల ప్లాంట్స్ ని మూసేశారని గుర్తు చేశారు. శాంతిపురంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ని శుభ్రం చేసే దిక్కు కూడా లేకుండా పోయిందని అన్నారు. కనీసం బస్ స్టాండ్ లు పాడైతే తిరిగి నిర్మించే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం బాధాకరం అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సండే మార్కెట్ కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్సీకి దోచుకోవడం తప్ప అభివృద్ది పట్టదని ఆరోపించారు.
అంతకు ముందు శాంతిపురంలో మహిళలతో నిర్వహించిన నారా లోకేష్ ముఖాముఖిలో వారు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. పన్నులు విపరీతంగా పెంచి అమ్మ ఒడి ఇచ్చాం అంటున్నారని వాపోయారు. అమ్మ ఒడిలో అనేక సాకులు చెప్పి డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదని చెప్పారు. ‘‘నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, బస్ ఛార్జీలు ఇలా మాపై ప్రభుత్వం విపరీతంగా భారాన్ని పెంచేసింది. వచ్చే అరకొర ఆదాయంతో బతకడం కష్టంగా మారింది. డ్వాక్రా సంఘాలను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. పొదుపు సొమ్ములు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఎంతో మంది పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బయట మా సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నా’’రంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
భరోసా ఇచ్చిన లోకేశ్
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. మహిళలకు భద్రత కొరవైంది జగన్ ఎక్కడ..? నియోజకవర్గంలో ముగ్గురు యువతులపై అత్యాచారాలు జరిగాయి. వాలంటీర్లు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ వారిపై చర్యలు తీసుకోలేదు. జగన్ పాలనలో మహిళలకు భద్రత - భరోసా లేదు. మహిళల తాళి బొట్లు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మద్యపాన నిషేదం తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ రెడ్డి. విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని జగన్ రెడ్డి తయారు చేస్తున్నాడు.