తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత ‌నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేసిన ఆమెకు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.  


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించేందుకు నారా భువనేశ్వరి నారావారిపల్లే నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన టీడీపీ అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అనంతరం చంద్రగిరి మండలంలో బహిరంగ సభలో ఆమె పాల్గొని నిజం గెలవాలి బస్సు యాత్ర కార్యక్రమంను నారా భువనేశ్వరి చేపట్టనున్నారు.


‘నిజం గెలవాలి’ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు సంబంధించి బస్సు కూడా రెడీ అయింది. ఈ బస్సుపై ఎన్టీఆర్‌, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన డిజైన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వల్ల చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి భువనేశ్వరి పరామర్శిస్తారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జరిగే సభలు, సమావేశాల్లో కూడా పాల్గొంటారు.