పుంగనూరులో శ్రీకాకుళం వాసులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవడం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేస్తుంటే.. అడ్డుకోవడానికి పుంగనూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం అభిమానులను పుంగనూరు నియోజకవర్గంలో దుస్తులు విప్పించి అవమానించడం మండిపడ్డారు. పుంగనూరులో అరాచకాల వెనకున్న పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ దురాగతంపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని రామ్మోహన్‌ నాయుడు నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు తక్షణమే పెద్దిరెడ్డి క్షమాపణలు చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. 


నాడు పార్లమెంట్ లో మిథున్ రెడ్డి
ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన బీసీలను అవమానిస్తే సీఎం జగన్‌ స్పందించరా ? అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రులను అవమానించిన వైసీపీ నేతలు రాజధానితో ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మాలన్నారు. వైసీపీ రౌడీ రాజకీయానికి భయపడే 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు విజయమ్మను ఓడించారని గుర్తు చేశారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో తనను అవమానించారని, ఇప్పుడు ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో శ్రీకాకుళం వాసులను అవమానించడం బాధాకరమన్నారు. పుంగనూరులో జరిగిన ఘటన నలుగురు వ్యక్తులకు సంబంధించినది కాదని, యావత్తు ఉత్తరాంధ్రను అవమానించారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు తీసుకోవాలా అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.


ఉత్తరాంధ్రపై జగన్ ది దొంగ ప్రేమ!


సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌ది దొంగ ప్రేమని విమర్శించిన ఆయన, రాజధాని పేరుతో ఇక్కడికి వస్తున్నది ప్రజలను ఉద్ధరించడానికి కాదని, సహజ వనరులను దోచుకోవడానికేనన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపారని, ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. కాలయాపన చేస్తూ చంద్రబాబును కావాలనే జైల్లో నిర్బంధించారని, న్యాయం ఏదో ఒక రోజు గెలుస్తుందని రామ్మోహన్ నాయుడు  ధీమా వ్యక్తం చేశారు. 


కుప్పం వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు బెదిరింపులు


 చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సైకిల్ పై యాత్రగా కుప్పం వరకూ వెళ్తున్నారు. సైకిల్ కు టీడీపీ జెండాలు పెట్టుకుని, చంద్రబాబు బొమ్మలున్న ఎల్లో టీషర్టులను ధరించి టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓ టీషాపు వద్ద ఆగిన టీడీపీ కార్యకర్తలను ఓ వ్యక్తి చూసి వారిని అడ్డుకున్నాడు. టీడీపీ కార్యకర్తలను దూషిస్తూ, అసభ్యకరంగా మాట్లాడారు. వారి ధరించిన పసుపు చొక్కాలు విప్పించాడు. టీడీపీ జెండాలు, చొక్కాలు తీస్తేనే పుంగనూరు నియోజకవర్గం నుంచి కదలనిస్తామని బెదిరించాడు. ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గమంటూ టీడీపీ జెండాలను నెలపై పడేసి తొక్కాడు.  ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.