Minister Roja Comments: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రైతు భరోసా 5వ విడత కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి తీరుపై విమర్శలు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై మళ్లీ కేసులను రీఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి లేఖలు రాయడం శోచనీయమని అన్నారు. సీఎం జగన్ తనపై ఉన్న అక్రమ కేసులను త్వరితగతిన విచారణ జరపాలని స్వయంగా ఆయనే  కోరారనీ రోజా గుర్తు చేశారు. అది దమ్మున్న నాయకుడి లక్షణమని రోజా కొనియాడారు. 


తనపై ఉన్న కేసులు విచారణ చేయమని చెప్పే ధైర్యం కూడా చేయబోరని చెప్పారు. 18 సంవత్సరాలపాటు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ స్టే లపైన స్టే లు తెచ్చుకున్న నేత చంద్రబాబు అని, ఆయన చరిత్రలో నిలిచిపోతారని రోజా విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై పురంధేశ్వరి సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పురందేశ్వరికి నీతి నిజాయితీ లేదని చెప్పారు. అసలు పురందేశ్వరిని చూసి బీజేపీకి ఓటు వేసే వాళ్లు లేరని అన్నారు.


బావ కళ్లల్లో ఆనందం కోసమే - రోజా


కేవలం ఎన్టీఆర్ కూతురు అనే ట్రంప్ కార్డ్ వాడుకుంటూ పురందేశ్వరి అన్ని పార్టీలు తిరుగుతున్నారని విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కు ఒక్కపూట అన్నం పెట్టలేదని, చంద్రబాబు కన్నా పెద్ద వెన్నుపోటు ఎన్టీఆర్ కు పురందేశ్వరి పొడిచిందని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీ కోసం చంద్రబాబు, పురంధేశ్వరి కొట్టుకున్నారని, ఇప్పుడు బావ కళ్లలో ఆనందం కోసం బావ రాసే స్క్రిప్ట్ లను చదువుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కూతురు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అవినీతిపై గతంలో ప్రధాని పార్లమెంట్ లో విమర్శలు చేశారని గుర్తు చేశారు. పార్టీ విధానాలు పక్కన పెట్టి టీడీపీ కోసం పురందేశ్వరి పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని సూచించారు. పురందేశ్వరిని పార్టీ నుంచి తరిమేయాలని అన్నారు. పురందేశ్వరి నిజాయతీ కలిగిన వ్యక్తి అయితే చంద్రబాబు చేసిన స్కాంలపై సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.


మంగళవారం (నవంబర్ 7) సాయంత్రం పుత్తూరు గోవిందపాళెం సచివాయల పరిధిలోని 11వ వార్డు CTR నత్తం, వీరప్పరెడ్డి కండ్రిక, బత్తల వారి కండ్రిక, విద్యానగర్, RDM గేట్ వీధులలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రోజా నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చేకూరిన లబ్దిని వివరించారు. అర్హత కల్గిన వారందరికీ పథకాలు అందుతున్నాయా? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? అని అడిగి తెలుసుకోవడంతోపాటు తన దృష్ఠికి తెచ్చిన కొన్ని సమస్యలను అధికారులకి వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.


రాష్ట్రంలోని పేదలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసు లేకుండా పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వ హాయాంలో కేవలం టీడీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పిన వాళ్లకే పథకాలు మంజూరు అయ్యేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అలాంటి రాజకీయ రాజకీయాలను రూపుమాపారు. ఆయన దృష్టిలో ప్రజలందరూ ఒకటే కులం మతం పార్టీ లాంటి భేదభావాలు లేని పాలన సాగిస్తున్నారు’’ అని మంత్రి రోజా అన్నారు.