Minister Kottu Satyanarayana In Tirumala: టీడీపీ చనిపోయిన పార్టీ అని, బతికుందని మీరెవరైనా అనుకుంటున్నారా? అని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) అడిగారు. అయినా ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పైన ఉందని, అనుకూల మీడియా మద్దతుతో నెట్టుకొస్తోందని ఏపీ దేవదాయ శాఖా మంత్రి విమర్శించారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా కొట్టు సత్యనారాయణ స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సంతృప్తికరంగా దర్శించుకోవడం జరిగిందని, రాబోయే ఎన్నికలు వాస్తవానికి, అబద్ధానికి మధ్య యుద్ధంలా జరుగుతుందని అన్నారు. వాస్తవ దృక్పథంతో రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని ధృఢ సంకల్పంతో ఎన్ని ఆటంకాలు జరిగినా సమర్ధవంతమైన పాలన సాగుతుందన్నారు.
జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) చేస్తున్న పనులతో ప్రతిపక్షం నాయకుల్లో అయోమయం నెలకొంటుందని, ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్న సమయంలో చేయలేని పనులు జగన్మోహన్ చేయడం ప్రతిపక్షం నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. రోజుకొక్క అబద్దం, రోజుకొక్క అవాస్తవంతో సీఎంపై ప్రతిపక్ష నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో సీఎంకి పెరుగుతున్న ఆదరణను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు కుట్ర పొందుతుందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చెప్పే అబద్దాలు కోటలు దాటి పోతుందని, ఏం చెప్తున్నారో ఒక్క మాట కూడా ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.
అబద్దాలు చెప్పడంతో లోకేష్ తండ్రికి తగిన తనయుడు లాగా ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు దత్త పుత్రుడు ప్రస్తుతంకు మౌనంగా ఉన్నా,చంద్రబాబు ఏం చెప్తే అదే చెప్పే పరిస్ధితిలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబును ఏదోక రకంగా పైకి ఎత్తాలని ఎల్లో మీడియా తాపత్రయం చేస్తుంటే పత్రికా రంగంకు కళంకంగా కనిపిస్తుందని, ఎల్లో మీడియా రాసే వ్రాతలు ప్రజలు చూసి అపహాస్యం చేసేలా ఉందని, వాళ్ళకు కావాల్సిన వ్యక్తి, అక్రమ పరిపాలన సాగించే ప్రభుత్వం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతున్నారన్నారు. సమర్ధవంతంగా పరిపాలన సాగించే ప్రభుత్వంను కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) ఘన విజయం సాధించి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతారని చెప్పారు. వారసులకు టిక్కెట్ ఇవ్వాలా లేదా అనేది సీఎం నిర్ణయంమని, సీఎం నిర్ణయం మేరకూ టిక్కెట్ ఇచ్చిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. దేశాల నుండి వచ్చిన విరాళాలకు టెక్నికల్ సమస్య ద్వారా కేంద్రం జరిమాన వేస్తుందని, టీడీపీలో ఉన్న వారు టీడీపీ వైపు చూసే ఆలోచనే లేదని, టీడీపీలో ఉన్న చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారని, ప్రజల దృష్టిలో టీడీపీ పార్టీ ఎప్పుడో చచ్చి పోయిందని, ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. ఎల్లో మీడియా టీడీపీని ఎత్తాలని చేస్తున్నా ఏం ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. మరొక సారి టీడీపీకి ప్రజలు అవకాశం ఇచ్చే యోచనలో లేరని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.