తిరుపతి శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.  లారీ - కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. ఆరుగురు చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 


ప్రమాదం ఎలా జరిగింది..
తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని శ్రీకాళహస్తి ఆలయం దర్శనార్ధం  భక్త బృందం కారులో ప్రయాణిస్తున్న క్రమంలో శ్రీకాళహస్తి మండలం, మెట్టకండ్రిగ గ్రామం వద్ద లారీ ఢీ‌ కొనడంతో ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ‌అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతిదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు విజయవడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు.. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని గమనించకుండా అతి వేగంగా మరో వాహనంను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.


3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు మూడు కిలో‌మీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. ప్రమాదంలో నుజ్జు‌నుజ్జు అయిన కారును రోడ్డు మీద నుంచి పక్కకు తొలిగించి ట్రాఫిక్ ను పునరుద్దరిస్తున్నారు పోలీసులు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial