తిరుపతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ వర్సెస్ లోకేష్ వర్సెస్ గా ఉన్న రాజకీయం, తాజాగా లోకేష్ వర్సెస్ రోజాగా మారుతోంది. తనపై చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి రోజాను డైమాండ్ రాణి, జబర్దస్త్ ఆంటీ అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో అగ్గి రాజేశాయి. నగరిలో ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ శ్రేణులు ఆందోనళకు దిగుతున్నాయి. 


మంత్రి రోజా సైతం నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. మంగళవారం నాడు టీడీపీ మహిళా నేతలు నగరిలో రోజా ఇంటి వద్దకి వెళ్లి చీర, గాజులు., పసుపు కుంకుమ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి రోజా ఇంటి వద్ద కొంతసేపు హైడ్రామా నడించింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ నాయకులను అక్కడ నుంచి పంపివేశారు. బుధవారం ఉదయం మరోసారి టీడీపీ, వైసీపీ క్యాడర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధం మొదలైంది.


ఈ తరుణంలో వైసీపీ మహిళా నాయకురాళ్లు ఒక్కడుగు ముందుకు వేసి ఖబర్దార్ లోకేష్, భాను ప్రకాష్.. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే యువగళం పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు మహిళలు నగిరి టవర్ క్లాక్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగి ధర్నా కార్యక్రమం చేపట్టారు. మంగళవారం జరిగిన సంఘటనపై మంత్రి రోజా ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు, చీరలు గాజులు ఇవ్వడంపై వైసీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 


వైసీపీ మహిళా నేతలు అంతటితో ఆగక నగిరి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  భాను ప్రకాష్, లోకేష్ చిత్రపటాలపై చీపుర్లతో, చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. మా జోలికొస్తే ఖబర్దార్ లోకేష్, భాను ప్రకాష్ అంటూ సవాల్ విసిరారు. మంత్రి రోజా ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో భాను ప్రకాష్ పసుపు, చీర పంపడంపై మహిళా నాయకురాలు మేరీ జయరాం మండిపడ్డారు. ఎలాంటి మేనిఫెస్టోలు తెలియని, సరిగ్గా తెలుగు కూడా రాని నేత నారా లోకేష్ అంటూ ఎద్దేవా చేసారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు మా మంత్రి రోజా గారిపై గెలిచి చూపాలని సవాల్ చేశారు. నగిరి నియోజకవర్గంలో భాను ప్రకాష్ ని కాలు కూడా పెట్టరాని పరిస్థితి ఎదురవుతుందని, మాటలు జాగ్రత్తగా రావాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్, నగిరి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  భాను ప్రకాష్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడంతో ఆ చిత్రపటాన్ని వైసీపీ శ్రేణులు కాల్చివేశారు.


మరోవైపు యువగళం పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పిచ్చాటూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి,  టీడీపీ ప్రభుత్వంలో, వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు లోకేష్. పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసీ ఛార్జీలను వైసీపీ ప్రభుత్వం మూడు సార్లు పెంచి ప్రజలపై విపరీతమైన భారం వేసిందని లోకేష్ విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ తర్వాత గాలికి వదిలేశారని, ఆర్టీసి సిబ్బందికి రావాల్సిన ప్రయోజనాలు ఏవీ వారికి ఇంతవరకు దక్కలేదని ఏపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు చేశారు.