ఏపీలో వికేంద్రీకరణపై విపక్షాలు, ఓ సెక్షన్ ఆఫ్‌ మీడియా కన్ఫ్యూజ్ చేస్తోందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన  వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేకపోయినా వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎక్కడా ఒక రాజధాని అని చెప్పలేదన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా వికేంద్రీకరణపై మాట్లాడారని తెలిపారు. 


హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ అన్నింటినీ చంద్రబాబు ఒక్కదగ్గర పెట్టారన్నారు సజ్జల. జగన్  సీఎం  అయ్యాక  పాలనా  సౌలభ్యం కోసం  మూడు  ప్రాంతాల్లో   రాజధాని  పెట్టాలని  అనుకున్నామని తెలిపారు. వైజాగ్‌లో సచివాలయం  ఉండాలి... అసెంబ్లీ  అమరావతిలో ఉంటుంది... హైకోర్ట్‌ కర్నూలులో  ఉంటుందన్నారు. ఇదే తమ విధానంగా చెప్పారు. మూడు  ప్రాంతాల  అభివృద్ధికి  కట్టుబడి  ఉన్నామని వెల్లడించారు. 
రాజధాని  అనే  పేరు   పెట్టుకున్న  లేకున్నా   మూడు  ప్రాంతాల  అభివృద్ధి  ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజధాని   అంశమే  ఎజెండా  కాదని అభిప్రాయపడ్డారు. 


రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారని... ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... విశాఖ పరిపాలన రాజధానిగా... శాసన రాజధానిగా అమరావతి... న్యాయరాజధానిగా కర్నూలు ఉంటుందననారు సజ్జల. స్వార్థ ప్రయోజనాల కోసం అసంబద్ద వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని... అన్ని  ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ విధానమన్నారు. 
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు ఘోర తప్పిదం చేశారని... దాన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందన్నారు సజ్జల. ఇప్పుడు రాజకీయం చేస్తున్నది చంద్రబాబేనన్నారు.ఎన్నికలుంటే ఓ మాట.. లేకుంటే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఎన్నికల కోసం తాము రాజకీయం చేయబోమన్నారు సజ్జల.