తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కోలాహలంగా జరిగింది. ప్రతీ ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం తిరుమల తిరుపతి దేవస్థానం ఆనవాయితీగా వస్తోంది. మొత్తంగా ఏడాదిలో నాలుగుమార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. ఆలయంను శుభ్రం చేసుకోవడాన్నే తిరుమంజనం అని పిలుస్తారు. ఆలయ గోడలకు,పై కప్పులకు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చూర్ణాన్ని గోడలకు అంటించి పరిశుభ్రం చేస్తారు. గర్భాలయాన్ని శుద్ది చేసే సమయంలో స్వామి వారిని పూర్తిగా నూతన వస్త్రంతో కప్పి వేస్తారు. గర్భగుడిలో అర్చకులు మాత్రమే ఉండి శుభ్రం చేస్తారు. మిగిలిన చోట ఆలయ సిబ్బంది శుభ్రం చేస్తారు.
శుద్ధి అయిన అనంతరం కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధం తదితర మూలికల పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. ఈ పరిమళంను ఆలయ గోడలకు అంటించడం ద్వారా క్రిమి కీటకాల నుండి రక్షణగా ఉంటుంది. ఉదయం 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన ఉంటుంది. ఆ తర్వా నుంచి భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. తిరుమంజనం, ఉగాది కారణంగా రేపు విఐపి బ్రేక్ లు రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్ధానంను నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో AVధర్మారెడ్డి తెలిపారు.
మార్చి 20న హుండీ ఆదాయం రూ. 4.96 కోట్లు
సోమవారం రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,824 మంది. తలనీలాలు సమర్పించినవారు 21,718 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.96 కోట్లు. సర్వదర్శనానికి 04 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
ఆన్ లైన్ టికెట్ల వివరాలివే
శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తానమని టిటిడి తెలిపింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను, మార్చి 23న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తారు. జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో పెడతారు.
శ్రీశైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు
ఇక, ఇటు శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రభోత్సవం ఉంటుంది. రాత్రి 7.00గంటలకు నందివాహనసేవ పూజలు చేస్తారు. అమ్మవారికి మహాసరస్వతి అలంకారం చేసి రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.00గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ అనంతరం ఏకాంతసేవ ఉంటుంది. రాత్రి 10.00 గంటలకు శివదీక్షా శిబిరాల వద్ద వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.