Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి (KCR Wife) శోభ తిరుమలకు చేరుకున్నారు. ఆమె వెంట ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహాల సముదాయంలోని శ్రీ రచన అతిధి గృహం వద్దకు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ సతీమణి చేరుకోవడంతో టీటీడీ అధికారులు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. సోమవారం (అక్టోబరు 9) రాత్రికి తిరుమలలోనే బస చేసి మంగళవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొననున్నారు.


అనారోగ్యంతో ఇంటివద్దే కేసీఆర్ (KCR)


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని మంత్రి కేటీఆర్ మూడు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్ వచ్చిందని, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పడుతుందని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


త్వరలో కేసీఆర్ బయటికి - కేటీఆర్ (KTR)


రేపో మాపో పులి బ‌య‌ట‌కు వ‌స్తదని.. వ‌చ్చిన త‌ర్వాత ఇవాళ ఎగిరెగిరి ప‌డుతున్న న‌క్కల‌న్నీ మ‌ళ్లీ తొర్రల‌కే పోతాయ‌ని కేటీఆర్ సెటైర్లు వేశారు. సోమవారం (అక్టోబరు 9) ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన ప్రగ‌తి నివేద‌న స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నిక‌ల వేళ ఏం చేయాలో కేసీఆర్ ఈ విశ్రాంతి వేళ కేటీఆర్ లెక్కలు వేస్తున్నారని తెలిపారు.


అక్టోబరు 15న అభ్యర్థులతో భేటీ


బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను అందరికంటే ముందే ప్రకటించిన సీఎం కేసీఆర్ (KCR), వారితో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబరు 15న తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరమే బీఆర్ఎస్ (BRS) మేనిఫెస్టోని కూడా ప్రకటించనున్నారు. అభ్యర్థులకు బీ - ఫారాలను కూడా ఈ సమావేశంలోనే అందజేస్తారు. ఎన్నికల ప్రచారం కూడా అదే రోజు నుంచి మొదలు పెట్టనున్నారు. 


అందులో భాగంగా అక్టోబరు 15న సాయంత్రం హుస్నాబాద్‌లో సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలు ఉండనున్నాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే మరో మీటింగ్‌లో కూడా కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరై ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.


Also Read: సర్వేలో కాంగ్రెస్‌కు ఎడ్జ్ - తెలంగాణలో బీఆర్ఎస్ వెనుకబాటుకు కారణం ఏమిటి ?