Telangana Politics :   తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటి వరకూ ఫలితాల్ని పొందలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఒపీనియన్ పోల్స్ లో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ కన్నా ముందు ఉందని చెబుతున్నాయి. క్లియర్ కట్ మెజార్టీ సాధించకపోయినా కాంగ్రెస్ పార్టీకే అడ్వేంటేజ్ ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కనీసం ఐదు సీట్ల గ్యాప్ ఉంటుందని  ఒపీనియన్ పోల్ చెబుతోంది. అయితే  ఓఏట్లు పోలరైజ్ అయితే.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ గ్యాస్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంత దూకుడుగా ఉన్నా వెనుకబడిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. 


పదేళ్ల అధికార వ్యతిరేకత ప్రభావం చూపిస్తోందా ?


తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదేళ్లుగా ఉన్న పాలన వల్ల ప్రజల్లో అధికార వ్యతిరేకత అనేది సహజంగానే పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ అధికార వ్యతిరేకత తగ్గించడానికి  బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తోంది. దళిత బంధు, బీసీ బంధు సహా అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. త్వరలో మైండ్ బ్లాంక్ అయ్యే పథకాలతో మేనిఫెస్టో ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ..  ఇలాంటి పథకాలు ప్రకటిస్తే... ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీకి ఇ్బబందికరంగా మారింది. యాంటీ ఇన్‌కంబెన్సీని అధిగమించడం కత్తి మీద సవాల్ గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


కాంగ్రెస్ ఒక్క చాన్స్ నినాదం  - ఆరు గ్యారంటీ హామీలు


తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ అనే  నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత కాలంగా చేస్తున్నారు. అదే  సమయంలో ఆరు గ్యారంటీ హామీల్ని ప్రకటించి  జోరు మీద ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటి నుండి .. ఆ పార్టీ పూర్తి స్థాయిలో జోష్ చూపిస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీనియర్లు తమ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చూపించడం మానేశారు. గెలుస్తుందన్న నమ్మకం ఏర్పడటంతో  గెలిచిన తర్వాత పదవుల కోసం కొట్లాట పెట్టకోవచ్చన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ఈ సారి గెలవకపోతే ఇంకెప్పుడూ గెలవలేమన్న  అభిప్రాయంతో  తాడేపేడో అన్నట్లుగాపోరాడుతున్నారు. గెలుపు గుర్రాలు అనుకున్న వారిని ఎవరినీ వదిలి పెట్టకుండా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. 


కేసీఆర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయాల్ని మార్చగలరు !


అయితే ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ కాస్త ముందు ఉన్నందున.. బీఆర్ఎస్ ఒత్తిడిలో ఉందని అనుకోవడానికి లేదు. కేసీఆర్ ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా ఇట్టే మార్చగలరు. అందుకే వ్చేచ నెలన్నర రోజుల్లో బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది కీలకం. కేసీఆర్ జిల్లాలను ప్రచారంలో భాగంగా చుట్టేసి.. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అనిపించగలికితే.. సీన్ మారిపోతుంది. అందుకే ఒపీనియన్స్ పోల్స్ ను బట్టి.. రాజకీయ పార్టీలు ఎలాంటి సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేస్తాయన్నదాన్ని బట్టే ఫలితాల ఉంటాయని అనుకోవచ్చు.