బిగ్ బాస్ సీజన్ 7లో ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఈ అయిదుగురికి బిగ్ బాస్.. కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడే ఈ అయిదుగురికి సూపర్ పవర్ కూడా ఇచ్చేశారు. ఈ బ్యాచ్ మొత్తానికి ‘పోటుగాళ్లు’ అని పేరు పెట్టారు. దీంతో అయిదు వారాల నుండి బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటున్న కొందరు కంటెస్టెంట్స్ మనసులో అసూయ మొదలయ్యింది. ఇక నామినేషన్స్ విషయంలో కూడా పోటుగాళ్లకే స్పెషల్ ట్రీట్మెంట్ దొరికినట్టుగా అనిపిస్తోంది. సోమవారం జరగనున్న నామినేషన్స్ సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఒక కంటెస్టెంట్స్ ఏడుపు మొదలుపెట్టేసింది కూడా.
అమర్‌దీపే శివాజీ టార్గెట్..
బిగ్ బాస్‌లో నామినేషన్స్‌కు సంబంధించిన మొదటి ప్రోమో ఇప్పటికే విడుదలయ్యింది. అందులో పోటుగాళ్లు.. తమ నామినేషన్స్ గురించి చెప్పారు. ఇక తాజాగా విడుదలయిన రెండో ప్రోమోలో నామినేషన్స్ వేసే ఛాన్స్ ఆటగాళ్లకు వచ్చింది. ‘‘ఇక ఆటగాళ్లు నామినేట్ చేసే సమయం వచ్చింది. పోటుగాళ్లు నుండి ఒకరిని, ఆటగాళ్లు నుండి ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది’’ అని ఆటగాళ్ల నామినేషన్స్ ప్రక్రియ గురించి బిగ్ బాస్ వివరించారు. ముందుగా శివాజీతో ఈ ప్రక్రియను ప్రారంభించమన్నారు. శివాజీ నామినేషన్స్ చేయడానికి నిలబడగానే.. అందరూ అమర్‌దీప్‌ను చూసి నవ్వారు. ‘‘మామూలుగా బాగానే ఉంటాడు. ఏదైనా గేమ్ వచ్చిందంటే చాలు..’’ అని అమర్‌దీప్‌ను ఉద్దేశించి అన్నాడు.
నయని పావని వర్సెస్ తేజ..
ఆ తర్వాత టేస్టీ తేజ నామినేట్ చేయడానికి వచ్చాడు. పోటుగాళ్ల నుండి నయని పావనిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ‘‘నామినేషన్ అనేది చాలా సీరియస్’’ అంటూ నయని పావని.. తేజ చెప్పిన కారణంపై అరవడం మొదలుపెట్టింది. ‘‘నా కష్టం కనిపించడం లేదని ఒక మాట చెప్పింది ఆ పిల్ల. దానికి నెగిటివ్ వైబ్స్ వచ్చాయి’’ అని తేజ కారణంగా చెప్పాడు. ‘‘నాకొక బలమైన కారణం చెప్పమని చెప్పండి ఒప్పుకుంటాను’’ అని వాదన మొదలుపెట్టింది నయని పావని. దానికి తేజ వెటకారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమర్‌దీప్.. తన నామినేషన్స్ గురించి చెప్పడానికి వచ్చాడు. ‘‘ఆడడానికి వచ్చిన ప్రతీ ఒక్కరు స్వార్థంగానే ఆలోచించాలి’’ అంటూ పూజా మూర్తి ముందు చెప్పిన కారణానికి సమాధానమిచ్చాడు. ‘‘మీరు ఎలా మిమ్మల్ని సమర్ధించుకోవాలని చూసినా.. అంతే’’ అని పూజా మూర్తి తన మాటపై గట్టిగా నిలబడింది.
ఏడుపు మొదలు..
పోటుగాళ్ల నుండి అంబటి అర్జున్ వేసిన నామినేషన్‌ను కూడా ఈ ప్రోమోలో చూపించారు. తను ముందుగా అమర్‌దీప్‌ను నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ‘‘మీరు వేస్తున్న ఓట్లు ఇక్కడ ఉండడానికి మీరు అర్హులు కాదు అని చెప్పి వేస్తున్నారు’’ అని అమర్‌దీప్ గుర్తుచేశాడు. అమర్ రియాక్షన్‌కు ‘‘ఇలాగే ప్రతీ వారం చించేస్తా, పొడిచేస్తా అంటున్నావు. బెటర్ అవ్వాలనే చెప్తున్నా’’ అని అర్జున్ అన్నాడు. దానికి అమర్‌దీప్‌కు కోపం వచ్చింది. ఆ తర్వాత శోభా శెట్టి.. అశ్విని శ్రీని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పింది. అది నచ్చని అశ్విని శ్రీ.. ‘‘ఇక్కడ మీరు ఏం చెప్పినా అందరూ వింటారు.’’ అని శోభాపై ఆరోపణలు చేసింది అశ్విని. ఆ మాటను శోభా ఒప్పుకోలేదు. ‘‘ఎక్కడ నేను ప్రియాంకను ఏమార్చాను’’ అని అడిగింది. ప్రియాంక కూడా అశ్విని చేసిన ఆరోపణలు ఒప్పుకోలేదు. అశ్వినితో పాటు తేజను కూడా నామినేట్ చేసింది శోభా. అశ్విని శ్రీ నామినేషన్స్‌లో ఉన్నందుకు బాధపడింది. ‘‘ప్లీజ్ నన్ను నామినేట్ చేయండి. నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. నాకు కనీసం ఒక్క ఆట అయినా ఆడాలని ఉంది.’’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన ప్రేక్షకులు అప్పుడే డ్రామా మొదలయ్యిందని అనుకుంటున్నారు.
Also Read: బిగ్ బాస్ బిగ్ 'ట్విస్ట్'- వైల్డ్ కార్డ్ ఎంట్రీ సభ్యులకి మరిన్ని పవర్స్, నామినేషన్స్ ప్రక్రియ షురూ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial