Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో రేపు ఉదయం 10.30 గంటలకు సుప్రీంలో వాదనలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాల వాదనలు జరిగాయి. జీఎస్టీ డీజీ రిపోర్ట్‌ను సీఐడీ కోర్టుకు అందించింది. చంద్రబాబు తరపున సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని, 2017కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హరీష్ సాల్వే వాదించారు. సెప్టెంబర్ 19న కోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని, సెప్టెంబర్ 20న కొన్ని డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిందని సుప్రీంకోర్టుకు సాల్వే తెలిపారు.


ఏసీబీ కోర్టులో పిటిషన్ల కొట్టివేత


అటు ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చంద్రబాబును విచారించాల్సి ఉందని, ఆయనను కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘంగా ఇటీవల కొద్ది రోజుల పాటు సీఐడీ కోర్టు విచారణ జరిపింది.


చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమాద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఇరు వర్గాల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. శుక్రవారం వాదనలు ముగియగా.. సోమవారానికి ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అనంతరం ఇవాళ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో.. దీనిపై హైకోర్టును చంద్రబాబు తరపు లాయర్ల ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు తరపు లాయర్లు సమాలోచనలు జరుపుతున్నారు. తీర్పు పూర్తి కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా చదవనున్నారు. అనంతరం హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది.


చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. కానీ మరో కొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. కానీ కస్టడీ పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో సీఐడీకి షాక్ తగిలినట్లైంది. ఈ క్రమంలో సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ప్రత్యేక రూంలోని విచారించింది. అనంతరం మరింత విచారించాల్సి ఉందని, ఆయన నుంచి మరిన్ని వివరాల్సి రాబట్టాల్సి ఉందని సీఐడీ అభిప్రాయపడింది. దీంతో కస్టడీకి మరోసారి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు డిస్మస్ చేసింది.