Pawan Kalyan News: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ వెన్నంటే ఉండే వీరాభిమానులు ఆయన సొంతం. అలా నేడు పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ వ్యక్తి పవన్ కల్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. జయం సినిమాలో నితిన్ హీరోయిన్ కోసం నడుముకు తాడు కట్టుకొని ఇంట్లోకి దూరి డ్యుయట్ పాడినట్లుగా ఈ అభిమాని కూడా సాహసించాడు. ఏకంగా ఓ భారీ క్రేన్ ను ఏర్పాటు చేసుకొని నడుముకు బెల్టుల సాయంతో క్రేన్ కు వేలాడుతూ పవన్ కల్యాణ్ దగ్గరికి చేరుకున్నాడు.
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు శాలువా, పూల దండ వేశాడు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పవన్ కల్యాణ్ సోమవారం (జూలై 17) వెళ్తుండగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని క్రేన్‌పై వచ్చి పవన్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకొంత మంది జయం సినిమాలో నితిన్ తో పోల్చుతూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
మరోవైపు, శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ జనసేన నాయకుడు కొట్టే సాయి అనే వ్యక్తిని సీఐ అంజూ యాదవ్ కొట్టిన విషయంపై కూడా పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డిని కోరినట్లుగా తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్ధాయిలో విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. సీఐ ప్రవర్తనపై ఉన్నత స్ధాయి అధికారితో విచారణ జరిపిస్తామన్నారు. అలాగే, ఉన్నత స్ధాయి అధికారుల నివేదిక ప్రకారం శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో అంజూ యాదవ్ పై ఉన్న ఆరోపణలు, వీడియోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియా వైరల్ గా మారాయని చెప్పుకొచ్చారు.
తాజాగా జరిగిన ఘటనలో మాత్రం అంజూ యాదవ్ తో పాటు కొట్టే సాయిని కూడా విచారస్తామని అన్నారు. కేవలం అంజూ యాదవ్ ప్రవర్తన తీరుపై మాత్రమే పవన్ కల్యాణ్ తనతో ప్రస్తావించినట్లు వివరించారు. పొలిటికల్ సీజన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారన్నారు. జిల్లాలో 23 జూన్ వరకు మొత్తం 2,123 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని.. అందులో 94 కేసులు ట్రేస్ కాలేదని స్పష్టం చేశారు. వీటిలో వాలంటీర్లు ప్రమేయం లేదని తేలిందని వివరించారు.
పవన్ కల్యాణ్ ఎస్పీ కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయం వద్ద అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడాల్సి ఉండగా, మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.