Chandrababu Kuppam Tour: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లకు ప్రజలు బలైపోవాల్సిందే అన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ, కుప్పం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కేజేఆర్ భరత్ మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనలు మరవక ముందే కుప్పంలో చంద్రబాబు పర్యటన సాగించడం దారుణమన్నారు. రోడ్ షోలు, డ్రోన్ విజువల్స్ పేరుతో రాష్ర్టంలో దారుణమైన రాజకీయ పబ్లిసిటీకి చంద్రబాబు తెరతీశారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని చంద్రబాబు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ఫైర్ అయ్యారు. 11 మంది అమాయకుల మృతికి కారణమైన చంద్రబాబు ఇంకెంత మందిని చంపాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటుందన్న టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.
కుప్పంలో అనుమతివ్వలేదనేది అవాస్తవం
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు అన్నట్లు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదే నేర్పిందా అని ప్రశ్నించారు. ప్రచార సభలు, రోడ్ షోల పేరుతో ఇంకెంత మందిని ప్రాణాలను బలి ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు.కుప్పంలో చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న సభకు సంబంధించి ఎక్కడ, ఎలాంటి భద్రతా ప్రమాణాలు తీసుకున్నారో చెప్పాలని జిల్లా యంత్రాంగం, పోలీసులు అడిగారని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ప్రశ్నలకు మంగళవారం అర్ధరాత్రి వరకు వేచి చూసినా టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. పూర్తి సమాచారం అందించిన తరువాతే సభకు అనుమతులు మంజూరు చేస్తామని పోలీసులు స్థానిక టీడీపీ నేతలకు సమాచారం అందించారని ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు.
ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం
రాష్ర్ట ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రజల ప్రాణాలపై బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా... చంద్రబాబు బెదిరింపు ధోరణితో వ్యవహరించడం దారుణమన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ఘోరం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకూడదా అని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో మరణించిన వారి ఆత్మలు కూడా శాంతించకుండా ఏం చేద్దామని చంద్రబాబు కుప్పం పర్యటనకు బయలుదేరారో రాష్ర్ట ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి వారం కూడా కాకుండానే కుప్పం సభ నిర్వహిస్తున్న చంద్రబాబుకు ప్రజల ప్రాణాలపై బాధ్యత ఎంతుందో తెలుస్తోందన్నారు. అన్యాయంగా బలైపోయిన 11 మంది ఆత్మ ఘోషకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు.
సభలు, ర్యాలీలపై నిషేధం లేదు
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలో ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించడం ఉద్దేశ్యం కాదని ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నిర్వహించే ర్యాలీలు, ప్రచార సభల్లో బాధ్యతను పెంచుతూ ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించే అంశాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల్లో అవసరమైన సౌకర్యాలు, జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు తీసుకుని సభ నిర్వహించాలని సూచించే మార్గదర్శకాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఇబ్బంది లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలనేని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రత కోసం రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
యువశక్తి సభలోనైనా పవన్ ప్రశ్నిస్తారా..
చంద్రబాబు రాష్ర్టంలో చేస్తున్న పబ్లిసిటీ మారణహోమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదో కనీసం ఆ పార్టీ నాయకులకైనా చెప్పారా అని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. ఇప్పటం గ్రామంలో అక్రమంగా నిర్మించిన గోడ కూల్చితేనే కాన్వాయ్ వేసుకుని వచ్చేసిన పవన్ 11 మంది అమాయకులు చంద్రబాబు సభల్లో బలైపోతే నోరు మెదపకుండా ఉండిపోవడానికి కారణం ఏంటన్నారు. పవన్ కూడా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నారా అని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. కనీసం శ్రీకాకుళంలో పవన్ నిర్వహిస్తున్న యువశక్తి సభలోనైనా చంద్రబాబు మారణహోమంపై ప్రశ్నిస్తారో లేదో చూడాలన్నారు.