Chandrabu Kuppam Tour :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని పెద్దూరుకు చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దులో వేల మంది టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. భారీ క్రేన్ సాయంతో పూల దండ వేశారు. మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటన ఉంటుంది. 


రోడ్ షోలు, సభలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. కుప్పం పోలీసులు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఉదయం నుంచి కుప్పంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.  చంద్రబాబు కుప్పం వచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కుప్పం నుంచి శాంతిపురానికి చంద్రబాబు టీడీపీ ప్రచార రథంపై వెళ్లాల్సి ఉండగా, ఆ వాహనాలను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాలుగు ప్రచార రథాలు, మైకులు వాడవద్దని తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 


శాంతిపురం మండలం కేసుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్‌ను తొలగించడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం నెలకొంది. అదికాస్తా తోపులాటకు కారణమైంది. అడ్డుగా ఉంచిన బారికేడ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేశారు.
 
చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదన్న పోలీసులు ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు అడ్డుకోవడం వివాదాస్పదమయింది. స్టేజ్ ను తీసేయడం.. ప్రచార వాహనాలను స్వాధీనం చేసుకోవడం .. డ్రైవర్లను అరెస్ట్ చేయడం వంటివి చేశారు. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తపై విచక్షణా రహితంగా లాఠీచార్జ ్కూడా చేశారు.  మైక్ పర్మిషన్ లేదని 4 ప్రచార రథాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు విధించగా, ఆంక్షలను దాటుకుని టీడీపీ కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, పలువురికి గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిపురం మండలం కెనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ ను సైతం పోలీసులు తొలగించారు.


టీడీపీ రోడ్‌ షోలు నిర్వహించిన సమయంలో ఇటీవల జరిగిన దుర్ఘటనల వేళ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో చేపట్టబోయే పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు రోడ్‌ షో, సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. నోటీసులు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు రోడ్‌ షో, సభలకు వెళ్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా సభలు నిర్వహించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.