Andhra Pradesh News : తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిపార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయబోతోంది. నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు పాలకమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయంలో  


2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. కోర్టు చిక్కులు లేకుండా ప్రక్రియను పూర్తి చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 1.88 కోట్లతో పిఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించింది టీటీడీ పాలకమండలి. రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపింది. 


రూ.14 కోట్లతో ఉద్యోగస్థుల ససతి సముదాయాల అభివృద్ధికి ఆమోదించింది. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూత పూయాలని నిర్ణయించింది. 


టీటీడీ ఐటీ సేవ విభాగంలో టెక్ రీప్లేస్‌మెంట్ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించింది. ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. 
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఘాట్ రోడ్డులో మరణించిన ఏథిరాజ నరసింహ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ఇచ్చే పరిస్థితి లేదని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తేల్చి చెప్పిందని సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు.