Andhra Pradesh News : తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu) ప్రచారం స్పీడ్ మరింత పెంచనున్నారు. బాదుడేబాదుడు, ప్రాజెక్టుల సందర్శన యాత్ర, రా...కదలిరా అంటూ దాదాపు ఏడాదిన్నరగా  జనంలోనే ఉన్న చంద్రబాబు...ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార ఉద్ధృతి మరింత పెంచనున్నారు. 'ప్రజాగళం'(Praja Galam) పేరిట సరికొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతోంది. రానున్న 45రోజులు మరింత కీలకం కావడంతో ఈ నెలన్నర రోజులు చంద్రబాబు పూర్తిగా జనం మధ్యలోనే ఉండలే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్(Pavan Kalyan)బీజేపీ(BJP)తో కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొననున్నారు.
ప్రజాగళంతో ప్రజల్లోకి
ఎన్నికల ప్రకటన కన్నా ముందే అభ్యర్థుల ఎంపిక, ప్రకటనతో కథనరంగానికి కాలు దువ్విన తెలుగుదేశం(TDP) అధినేత చంద్రబాబు(Chandra Babu)...ఇప్పుడు ప్రచారంలోనూ వినూత్న పంథా అనుసరిస్తున్నారు. ఇప్పటికే రా...కదలిరా సభలో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించిన చంద్రబాబు...ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గం టచ్‌ చేసేలా ఆయన రానున్న విస్తృతంగా పర్యటించనున్నారు. వైకాపా అరాచకపాలన, జగన్ చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ చర్చలు ముగియడంతో మరో రెండు, మూడు రోజు‌ల్లో ప్రజాగళం(Praja Galam) యాత్ర ప్రారంభం కానుంది. తొలి విడతగా నంద్యాల(Nandyala) నుంచి గానీ, మార్కాపురం(Markapuram) నుంచి గానీ ప్రజాగళం పర్యటనలు చంద్రబాబు ప్రారంభించనున్నారు.


రచ్చబండ(Rachabanda) తరహాలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో బహిరంగ సభలు అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉన్న మేథావులు, విద్యావంతులతో కలిసి రచ్చబండ నిర్వహించనున్నట్లు తెలిసింది. దీనికి సుమారు 10వేల మందిని ఆహ్వానించే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ సభ విజయంవతం కావడంతో...త్వరలోనే ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ సభలు ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తే తాము ఏం చేయాలనుకుంటున్నామో వివరించనున్నారు.


ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
సూపర్ సిక్స్ పేరిట ఇప్పటి తెలుగుదేశం మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతలు....జనసేన(Janasena), బీజేపీ(BJP) ఇచ్చిన హామీలను సైతం వాటికి జతచేసి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరుకానున్న నేపథ్యంలో ఇదే వేదికపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.


ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో కలిసి తాడేపల్లిగూడెం సభలో పాల్గొన్నచంద్రబాబు..రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సభలో మరో 7,8 నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శంఖారావం పేరిట లోకేశ్(Lokesh) మలివిడత యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏడాదిన్నరగా ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి జగన్ లబ్ధి పొందుతారని గ్రహించిన చంద్రబాబు...ఏడాదిన్నర క్రితమే ఆయనే నేరుగా పవన్‌ను వెళ్లి కలిసిశారు. ఆ తర్వాత అది ఇరుపార్టీల మధ్య పొత్తుకు బీజం పడింది. ఇప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చన్న లక్ష్యంతో బీజేపీతో జట్టుకట్టారు.