Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇటీవల ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ హెలిప్యాడ్ కు అనుమతి రానందున జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
జన సమీకరణకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 10 వేల మందితో వెళ్లేలా అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. మార్కెట్ యార్డులో ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకుని కొద్దిమందినే అనుమతించే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలను దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వైఎస్ జగన్ పర్యటన ఆగదు
వైఎస్ జగన్ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్నారు. ఈ సమాచారం తెలియగానే కూటమి నాయకులు మామిడి రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌ను కలవద్దని, ఏ సమస్యలు ప్రస్తావించొద్దని కూటమి నేతలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు తప్పవు అంటూ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు ఎన్ని ఆటంకాలు కలిగించినా బంగారుపాళెంలో జగన్ పర్యటన ఆగదు. టన్నులకొద్ది ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుంటే ఆపాలని చూడని ఫారెస్ట్ అధికారులు మామిడి రైతు తన చెట్లను కొట్టేస్తే మాత్రం 12,000 రూపాయలు ఫైన్ వేశారు. -భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు
సింగయ్య మృతిపై కేసు నమోదు
పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోవడం వివాదాస్పదమైంది. ఘటన జరిగిన కొన్ని రోజులకు జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతిచెందారని గుంటూరు ఎస్పీ సతీష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వాహనం డ్రైవర్, మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న అవాంఛిత ఘటనలు, నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే తాము ఇచ్చే పర్మిషన్ మేరకు పర్యటన చేస్తే ఎవరికి ఏ సమస్యా ఉండదని అధికారులు చెబుతున్నారు.
హెలిప్యాడ్‌కు రాని అనుమతి - జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ జగన్ జులై 3వ తేదీన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే హెలిప్యాడ్ కు పోలీసుల నుంచి అనుమతి రానందున పర్యటనను వాయిదా వేసుకున్నారని వైసీపీ నేతలు తెలిపారు. మాజీ సీఎం జగన్ హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడుకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ కు అధికారుల నుంచి అవసరమైన అనుమతులు రాలేదు. దాంతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. జూన్ 27, 2025న ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా, అధికారులు అనుమతి ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలిప్యాడ్ స్థలం యజమానిపై సైతం ఒత్తిడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు.