EC suspends Tirupati Police: తిరుపతి: ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం రోజురోజుకూ ముదిరిపోతోంది. ఇదివరకే టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం రాష్ట్రంలో దొంగ ఓట్లపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక (Tirupati Bypolls)లో దొంగ ఓట్ల వ్యవహారంపై పోలీసులపై ఎన్నికల సంఘం (Election Commission) కొరడా ఝళిపించింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సమయంలో అప్పటి తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ సీఐలుగా విధులు నిర్వహించిన శివప్రసాద్‌రెడ్డి, శివప్రసాద్‌లపై ఈసీ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


పోలీసులపై ఈసీ కొరడా.. 
తిరుపతి ఈస్ట్, వెస్ట్ సీఐలతో పాటు తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌ రెడ్డిని సైతం ఈసీ సస్పెండ్‌ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్‌ను వీఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు చేసినా, ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టించారని ఈ పోలీసులపై అప్పటినుంచి ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టివేశారని తెలిసిందే. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు.


ఎన్నికల్లో అవకతవకలపై ఈసీ చర్యలు 
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ కార్డుల (Epic) డౌన్ లోడ్ స్కామ్‌లో చంద్రమౌళీశ్వర రెడ్డిని బాధ్యుడిగా సీఈసీ గుర్తించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహించారు. నకిలీ ఓట్లు, ఓటర్ కార్డుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఇటీవల అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు వేశారు.