Chandrababu Naidu House Land Issue : రాష్ట్రంలో కొంతమంది అధికారులు అవినీతి పతాక స్థాయికి చేరిపోయింది. అవతల వ్యక్తులు ఎవరన్న దానితో సంబంధం లేకుండా చేయి తడిపితే గాని పని చేయని స్థితికి అధికారులు దిగజారిపోయారు. రోజువారీ కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని చాలామంది అధికారులు పని చేస్తున్నారు. ఆ లక్ష్యాలను చేరితే గాని ఇంటికి వెళ్ళని అధికారులు రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతోమంది ఉన్నారు. అటువంటి అధికారులకు సంబంధించిన వ్యవహారమే తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం డిమాండ్ చేసి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొంత స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. ఇందుకోసం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.85 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇస్తేనే గాని ప్రక్రియ చేపట్టనని తేల్చి చెప్పడంతో.. స్థానిక నాయకులు అందుకు అవసరమైన మొత్తాన్ని చెల్లించారు. ఆ తరువాత ఫైల్ ముందుకు కదిలింది. ఈ విషయాన్ని అప్పట్లో టీడీపీ నాయకులు కూడా బయట పెట్టలేదు.


చంద్రబాబు దృష్టికి విషయం.. డిప్యూటీ సర్వేయర్ పై చర్యలు 


డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్లారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కప్పం పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనను ఆర్ అండ్ బి అతిథి గృహంలో పలువురు నాయకులు కలిశారు.  డిప్యూటీ సర్వేయర్ పాల్పడిన అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ నాయకులు తీసుకువెళ్లారు. దీనిపై షాక్ కు గురైన సీఎం చంద్రబాబు నాయుడు.. అక్కడే ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు.


సర్వే శాఖ ఏడి గౌస్ భాషాతో శాఖ పరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. అలాగే, భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపిన అధికారులు అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జెసి శ్రీనివాసులు సర్వే ఏడిని సోమవారం ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం సాయంత్రం జెసి శ్రీనివాసులకు సర్వే శాఖ అధికారులు అందించగా.. లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ను సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలానికి సంబంధించి పని చేసేందుకు కూడా డబ్బులు వసూలు చేసే స్థాయికి అధికారులు వెళ్లిపోవడాన్ని చూస్తుంటే.. క్షేత్రస్థాయిలో అవినీతి వ్యవహారాలు ఏస్థాయికి వెళ్ళిపోయాయో అర్థం అవుతోందని పలువురు  పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ తరహా అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలను కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.