NDA Vs YSRCP In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు వారాలే అయింది. కానీ రాజకీయ కాక మాత్రం ఎన్నికల హడావుడిని తలపిస్తోంది. ఈసారి కూడా సామాజిక పింఛన్‌పై అధికార ప్రతిపక్షం మధ్య వార్ నడుస్తోంది. అయితే ఈ యుద్ధం చాలా విభిన్నంగా సాగుతోంది. చాలా సైలెంట్‌గా ఒకరిపై ఒకరు నెగిటివిటినీ ప్రచారం చేసుకుంటున్నారు. 


వలంటీర్లు లేకుండా ఏ పని సాధ్యం కాదని... వందనాల పేరుతో వందల కోట్లు గత ప్రభుత్వం వారి కింద ఖర్చు పెట్టింది. వారి వల్ల సంక్షేమ పథకాలు సంక్షేమంగా లబ్ధిదారులకు చేరుతున్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఎన్నికల టైంలో కూడా పింఛన్ల పంపిణీపై రగడ జరిగింది. వారిని విధుల నుంచి ఈసీ తప్పించడంతో మిగతా వారితో పంపిణీ సాధ్యం కాదని అధికారులు చెప్పేశారు. లబ్ధిదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిప్పించారు. 


అప్పటి సీఎస్‌ ఇతర ఉన్నతాధికారుల తీరును టీడీపీ తప్పుపట్టింది. సచివాలయ సిబ్బందితో ఎందుకు పంపిణీ చేపట్టలేరంటూ ప్రశ్నించింది. అయితే దీనికి కౌంటర్‌గా వైసీపీ కూడా విమర్సలు చేసింది. అతి ముఖ్యమైన వలంటీర వ్యవస్థను తప్పించి ప్రజల వ్యతిరేకత వస్తుందని టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించింది. వ్యతిరేకత తగ్గించుకునేందుకు ఇలాంటి లేఖలు రాస్తోందని స్వయంగా జగనే దుమ్మెత్తి పోశారు. 


సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది. వలంటీర్లను ఇంత వరకు రీ రిక్రూట్ చేసుకోలేదు. మొదటి నెల పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారో అని వైసీపీ చాలా ఆసక్తిగా చూసింది. అయితే వలంటీర్ల ప్రమేయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగంతోనే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది కలిసి ఈ కార్యక్రమాన్ని 95 శాతం విజయవంతం చేశారు. 


ఇప్పుడు సాధ్యమైంది అప్పట్లో ప్రభుత్వం ఎందుకు చేయలేదని సీఎం, డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. అప్పట్లో కావాలనే ప్రజలను ఇబ్బంది పెట్టాలనే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయలేదని ఆరోపించారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇగోనే కారణమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 


దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్‌ పత్రికలో ఫ్రంట్‌పేజ్‌లో యాడ్ ఇచ్చింది. చంద్రబాబు పెన్షన్‌లపై ఇన్ని అబద్దాలా అంటూ విరుచుకుపడింది. 2014-19 వరకు టీడీపీ ఇచ్చిన పింఛన్లు, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఇచ్చిన పింఛన్లు బేరీజు వేస్తూ చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడింది. అంతే కాకుండా వివిధ కార్యాలయల వద్ద గుమిగూడిన లబ్ధిదారుల ఫొటోలతో వార్త రాశారు. 
అంటే గత ప్రభుత్వం అనవసరమైన ఖర్చు పెట్టిందని... ప్రభుత్వ సిబ్బందితో జరపాల్సిన పనులను కూడా వలంటీర్ల పేరుతో భారీగా ఖర్చులు చేసిందని వైసీపీపై నెగిటివిటీని అధికార కూటమి ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముందు పోలవరం, తర్వాత అమరావతి, ఇప్పుడు వంలటీర్ వ్యవస్థ. 


ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగానే కొందరు నేతలు కూడా వలంటీర్ వ్యవస్థతో అనవసరమైన ఖర్చే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఇంత వరకు ఈ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ కూడా వారి అవసరం లేదన్నట్టుగానే మాట్లాడారు. అయితే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని మాత్రం చెప్పారు. ఇంత జరుగుతున్నా ఈ వ్యవస్థపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


మరోవైపు గత ప్రభుత్వంతో పోలుస్తూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్రమంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. కార్యాలయాలపై దాడుల విషయంలోతప్ప వేరే విషయాలపై ఆ పార్టీ నేతలు ఫోకస్ చేయడం లేదు. అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడిని మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నారు. వారి అనుకూల మీడియాలో పథకాలపై కథనాలు, వ్యక్తిగత, భౌతిక దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తోంది. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఒకరిపై ఒకరు సైలెంట్‌గా నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు.