తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్‌డీఈ స్క్రీన్‌పై సినిమా పాటలు దర్శనమిచ్చాయి. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన ప్రదేశంలో కమర్షియల్ సినిమా పాటలేంటని ఆశ్చర్యపోయారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక భావనను అడుగడునా ఉట్టిపడేలా చేసేందుకు ఎస్వీబిసి ఛానెల్ తిరుమలలో చాలా ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. ఎస్‌వీబీసీ ఛానల్‌లో వచ్చే కార్యక్రమాలు ఇందులో కనిపిస్తుంటాయి. అలాంటి స్క్రీన్‌పై ఒక్కసారిగా సినిమా పాటలు చూసిన జనం బిత్తరపోయారు.
తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌లపై సాయంత్రం ఆరు గంటలకు అధ్యాత్మిక కార్యక్రమాలకు బదులుగా స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఒకట్రెండు నిమిషాలై ఉంటే ఏదో పొరపాటున జరిగి ఉంటుందని అనుకోవచ్చు. కానీ దాదాపు అరగంటపాటు సినిమా పాటలను ఎస్వీబీసీ సిబ్బంది ప్రసారం చేశారు.
ఓ వైపు టీటీడీ బ్రాడ్ క్యాస్టింగ్‌లో గోవింద నామాలు వినపడుతుండగా, మరోవైపు స్క్రీన్‌పై సినిమా పాటలు రావడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానల్‌లో సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు కేకలు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెట్ అప్ బాక్స్ ఫెయిల్యూర్ కారణంగానే సినిమా పాట ప్రసారం అయ్యిందని, సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానల్ యాథావిధిగా ప్రసారం అవుతుందని టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.