Transgender alleges lover cheats her with false Promise In Chittoor District : ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు చూసి ఉంటాం. కానీ ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ లవ్ స్టోరీ కాస్త భిన్నం. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పిన ప్రియుడి కోసం తాను లింగ మార్పిడి చేయించుకున్నానని, కానీ లవర్ తనను మోసం చేశాడంటూ ఓ ట్రాన్స్ జెండర్ పోలీసులను ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఎలా చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెకు చేందిన ట్రాన్స్ జెండర్ స్వీటీ అలియాస్ లోకేష్ ఇంటర్ వరకూ చదువుకుంది. ములకలచెరువు మండలంలోని వెంగంవారిపల్లెకు చేందిన మహేష్‌తో కొన్నేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ అబ్బాయిలే కావడంతో తాము కలిసి ఉండడం కష్టమని భావించారు. అదే సమయంలో మహేష్ తనకు వచ్చిన ఆలోచన లోకేష్‌కి చెప్పాడు. ట్రాన్స్ జెండర్‌గా మారితే ఇద్దరం కలిసి ఉండే అవకాశం ఉంటుందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ప్రియుడి మాటలు నమ్మి లింగమార్పిడి..
లవర్ మహేష్ మాటలు నమ్మిన లోకేష్ లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ జెండర్ స్వీటీగా మారింది. లింగమార్పిడి చేసుకోవడంతో లోకేష్ స్వీటీగా పేరు మార్చుకున్నాడు. ఆ తరువాత మహేష్, స్వీటీలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వేరే లవర్స్‌లాగ వీరు సైతం బయటకు కలిసి వెళ్తూ ఉండేవారు. అయితే ఆర్ధికంగా స్వీటీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మహేష్ తరచుగా ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు. లవర్ మహేష్ అడిగితే స్వీటీ కూడా ఎలాగోలా డబ్బులు సమకూర్చి అడినంత డబ్బు అందించేది.
పెళ్లి మాటెత్తితే సీన్ రివర్స్..
కొంతకాలం పాటు మహేష్, స్వీటీ(లోకేష్) ప్రేమాయణం కొనసాగింది. ఇంకా ఎంతకాలం ఇలానే ఉందాం.. మళ్లీ పెళ్లిచేసుకుందామని మహేష్‌ను అడిగింది స్వీటీ. అప్పటి నుండి స్వీటీకి మహేష్ కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ముందులా ఫోన్లో అంతగా మాట్లాడటం లేదు. ఏదో ఒక పని పేరుతో స్వీటీని దూరం చేసేవాడు. దీంతో అనుమానం వచ్చిన స్వీటీ మహేష్ ను నిలదీసింది. కానీ అప్పటికే స్వీటీని శారీరకంగా, ఆర్ధికంగా ఉపయోగించుకున్న మహేష్, ఇకపై స్వీటీని దూరం పెట్టి మరొకరితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే స్వీటీకి తెలియకుండా మరో యువతితో వివాహానికి సిద్దంమయ్యాడు.
విషయం తెలుసుకున్న స్వీటీ..
ఎలాగోలా విషయం తెలుసుకున్న స్వీటీ తనను మోసం చేయద్దని మహేష్‌ను స్వీటీ బతిమాలినా అతడు ఆమెతో పెళ్లికి అంగీకరించలేదు. స్వీటీ ఫోన్‌ను లాక్కొని అందులో ఉన్న వారిద్దరి ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు డిలీట్ చేశాడు. మోసపోయానని గ్రహించిన స్వీటీ మదనపల్లె పోలీసులను ఆశ్రయించింది. స్వీటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక సతమతం అవుతున్నారు. మహేష్‌ను పీఎస్‌కు పిలిపించిన పోలీసులు.. స్వీటీ వద్ద తీసుకున్న నగదు తిరిగివ్వాలని సూచించారు. అయితే తనకు స్వీటీ కావాలని చెప్పి మహేష్ ట్విస్ట్ ఇచ్చాడు. కానీ పీఎస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం.. తాను మరోకరిని పెళ్ళి చేసుకున్నా, స్వీటీని ముందులాగే ప్రేమిస్తానని చెప్పి, నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో కేసును ఎలా పరిష్కరించాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు మదనపల్లె పోలీసులు.