టిడిపి అధినేత నారా చంద్రబాబు పుంగనూరు పర్యటనలో అల్లర్లు చోటు చేసుకున్నాయ్. ఈ కేసులో పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో A1 ముద్దాయిగా చల్లా బాబును చేర్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్నాళ్ళు చల్లా బాబు అజ్ఞాతంలో ఉంటూనే...హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 7 కేసుల్లో 4 కేసులకు షరతులతో  కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో చల్లా బాబు... పుంగనూరు పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. స్టేషన్ వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. డిఎస్పి సుధాకర్ రెడ్డి సమక్షంలో చల్లా బాబు లొంగి పోయారు. చల్లా బాబును పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. 


సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన యాత్ర... యుద్ధాన్ని తలపించింది. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులు, కవ్వింపు చర్యలతో టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగారు. దీంతో  అటు అన్నమయ్య జిల్లా అంగళ్లు, ఇటు చిత్తూరు జిల్లా పుంగనూరు శివారులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్. ఆగస్టు 4న చంద్రబాబు చేపట్టిన యాత్ర ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లో పూర్తి చేసుకుని... కురబలకోట మండలం అంగళ్లు మీదుగా చిత్తూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అంగళ్లులో ఉదయం నుంచే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు తరమేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. 


పోలీసులు సర్దిచెప్పినా రెండు వర్గాలు వినకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల‌దాడి త‌ర్వాత వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. రెండు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. ఘర్షణను నివారించేందుకు ముందుగా లాఠీ చార్జీ చేశారు.. అదుపులోకి రాకపోవడంతో భాష్ఫ వాయువుని ప్రయోగించారు.. అయినప్పటికీ ఇరు వ‌ర్గాలు రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంట్రీ మొదలు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది.


మొదట పుంగనూరు మీదుగా చంద్రబాబు సోంపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. అయితే గో బ్యాక్ చంద్రబాబు నినాదాలతో వైసీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. మొదట మొలకల చెరువు వద్ద భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంగళ్లులో మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే రమ్మని పిలిస్తున్నానంటూ సవాల్‌ విసిరారు. 


కేవలం గొడవ చేయడానికే చంద్రబాబు పుంగనూరులోకి వచ్చారని రిషాంత్ రెడ్డి వివరించారు. పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చంద్రబాబు పర్యటన సాగాల్సి ఉందన్నారు. కానీ, గొడవ చేయడానికే పుంగనూరులోకి ప్రవేశించారని చెప్పారు. పోలీసులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు.