TTD Chairman Bhumana Karunakar Reddy :
విమర్శలకు తలొగ్గి అభివృద్ధిని ఆపే వాడిని కాదని, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చుదిద్దుతామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి తుడా కార్యాలయం వెనుక తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన కచ్ఛపి ఆడిటోరియంను, సుకృతి కళానిలయంను ఆదివారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, స్మార్ట్ సిటీ ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 
రోడ్లు వేసి తిరుపతి నలుదిక్కులను అనుసంధానం
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిని ఎన్ని రకాలుగా అభివృద్ది చేయొచ్చని గడిచిన నాలుగేళ్ళలో చేసి చూపించాం అన్నారు. రాష్ట్రంలో తిరుపతి నగరంలో జరిగినట్లు అభివృద్ది మరెక్కడా జరగలేదన్నారు. విమర్శలకు తలొగ్గి అభివృద్ధిని ఆపేవాడికి కాదని, ఎన్నడూ లేని విధంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతి నలుదిక్కులను అనుసంధానం చేయడం‌ జరిగిందన్నారు. ఈ యజ్ఞం ఇంతటితో ఆగదని, తిరుపతిని ఆధ్యాత్మిక, సాహిత్య, కళలు, మానవీయ విలువలు పెంపొందించేలా అభివృద్ది చేస్తామన్నారు. సరస్వతీ దేవి చేతిలోని వీణ అయిన కచ్ఛపి పేరుతో ప్రారంభించిన ఈ ఆడిటోరియం అందుబాటులోకి రావడం సంతోషకరమని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. 


అనంతరం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. తిరుపతిలో అభివృద్దితో బాటు కళలకు, సాంస్కృతిక కార్యాక్రమాల నిర్వహణకు ముందుంటున్న భూమన కరుణాకర్ రెడ్డి బాటలోనే మనమంతా పయనిద్దామన్నారు. తిరుపతి నగరం సుందరీకరణతో బాటు రహదారులు విస్తరించడంతో ఓక మంచి రూపు సంతరించుకున్నదన్నారు. మరో 30 ఏళ్లు ముందు అవసరాలకు సరిపడా రహదారులు నిర్మాణం చేస్తున్నారని,రహదారులు సౌకర్యవంతంగా ఉంటుందో అక్కడ అభివృధ్ది ఉంటుందన్నారు.. తిరుపతి నగరంలో రహదారులు సౌకర్యవంతంగా భూమన కరుణాకర్ రెడ్డి అభివృద్ధి చేశారన్నారు.. ఆరు కోట్ల మంది తిరుపతి - తిరుమలను సందర్శిస్తున్నారని, ఈ రోజు  వచ్చే యాత్రికులకు, నగర ప్రజలకు సరిపడా రహదారులు నిర్మాణం జరిగిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలియజేశారు.


సామాన్య భక్తుడిగా సర్వదర్శనం భక్తుల వసతుల పరిశీలన
సామాన్య భక్తుడి తరహాలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి ప్రవేశించి సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ కల్పించిన వసతులను శనివారం పరిశీలించారు. సామాన్య భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, కాఫీ, టీ వంటివి సకాలంలో అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకుని అన్నప్రసాదం భక్తులకు సరిపోయేంతగా పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఉదయం నుండి ఇప్పటివరకు 47 కంపార్ట్మెంట్ల నుంచి టోకెన్ లేని భక్తులను దర్శనానికి పంపామని, దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని విజిలెన్స్ అధికారులు వివరించారు.