Tirupati man marries Spain woman in Indian Tradition:


ప్రేమ అంటే జాతి, మతం, కులం, పేద, ధనిక అనే అభిప్రాయభేదాలు ఉండవు. నిజమైన ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడతారు. దేశం కాని దేశానికి చెందిన యువతి, యువకులు ప్రేమించుకోవడమే కాకుండా, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు సైతం ఎక్కుతున్నారు. కొందరైతే వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకుంటారు. తాజాగా తిరుపతికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి  స్పెయిన్ కు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. పైగా పెద్దలను ఒప్పించడమే కాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ తెలుగు అబ్బాయి, స్పెయిన్ అమ్మాయి వివాహం స్టోరీ ఇక్కడ తెలుసుకోండి.


స్పెయిన్ అమ్మాయితో తిరుపతి యువకుడు లవ్.. 
తిరుపతికి చెందిన యుగేష్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. వీరి ఆఫీసుకు సమీపంలో ఓ స్కూల్లో స్పెయిన్ దేశానికి చెందిన లూరా రోషియా స్పానిష్ టీచర్‌గా పని చేస్తుంది. రోజూ కంపెనీకి వెళ్తూ వచ్చే సమయంలో స్పెయిన్ అమ్మాయిని చూసిన యుగేష్ ప్రేమలో పడ్డాడు. ఆపై యుగేష్ రోజూ రోషియాకు తెలియకుండా ఫాలో అయ్యేవాడు. అలా రోషియా పని చేసే స్కూల్ లో యుగేష్ కి తెలిసిన వ్యక్తి ఉండడంతో వారి ద్వారా యుగేష్ స్పెయిన్ అమ్మాయి వివరాలను తెలుసుకున్నాడు. ఆ తెలిసిన వ్యక్తి ద్వారా యుగేష్ స్పెయిన్ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు.. ఇలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. 


అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించిన తెలుగు అబ్బాయి.. 
ఇద్దరు కలిసి తిరుగుతూ ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. దీంతో ఇరువురు తమ ప్రేమకు కలకాలం నిలుపు కోవాలని, జీవితాంతం ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా యుగేష్ ముందుగా తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. మొదట యుగేష్ ప్రేమను తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. విదేశీ యువతి కావడంతో వారు వివాహానికి నిరాకరించారు. కానీ యుగేష్ తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించి చివరికి పెళ్ళికి ఒప్పించాడు. దీంతో రోషియా తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. వాళ్లతో మాట్లాడి తమ పెళ్లికి కూడా ఒప్పించాడు. దీంతో వీరు ఇద్దరూ యుగేష్ తల్లిదండ్రుల కోరిక మేరకూ హిందూ సాంప్రదాయం ప్రకారం చిత్తూరు జిల్లా అరగొండ ఆంజనేయ స్వామి వారి ఆలయం సమీపంలో గౌరీశంకర్ కళ్యాణ మండపంలో వివాహం జరిపించారు.


భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానికులు, స్పెయిన్ అమ్మాయితో సెల్ఫీలు..


ఈ వివాహానికి యుగేష్, రోషియాలకు చెందిన కుటుంబ సభ్యులతో పాటుగా, బంధు మిత్రులు ఈ వివాహానికి హాజరు అయ్యారు. స్పెయిన్ అమ్మాయిని తిరుపతి యువకుడు వివాహం చేసుకుంటున్నాడని విషయం స్ధానికులకు తెలిసింది. దాంతో స్పెయిన్ అమ్మాయిని, వీరి వివాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున హాజరై, స్పెయిన్ అమ్మాయితో సెల్ఫీలు దిగారు. తన తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు స్పెయిన్ అమ్మాయి పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించి తన ప్రేమను గెలిపించుకున్న యువకుడిని ప్రశంసిస్తున్నారు.