Chittoor YSRCP MLA Srinivasulu: చిత్తూరు : చిత్తూరు ఎమ్మెల్యేపై కొందరు మహిళలతో కలిసి మాజీ కార్పొరేటర్ భూ కబ్జా అరోపణలు చేశారు. వంశపారపర్యంగా వస్తున్న భూమిని అధికారులతో కుమ్మక్కై చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చిత్తూరు నగరం శివారులో గల ఇరువారం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఆఫీసు కోసం ఆ స్థలాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు, అధికారులతో కలిసి కబ్జా చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ రాజేశ్వరి ఆరోపించారు.
చిత్తూరు నగరంలో ఇరువారం సమీపంలో మాజీ కార్పొరేటర్ రాజేశ్వరికి వంశపారపర్యంగా లభించిన వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు భూ కబ్జాకు పాల్పడుతున్నారంటూ మాజీ కార్పొరేటర్ ఆరోపించారు. బ్రిటిష్ పాలన కాలం నుంచి ఈ భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తూ కొన్ని తరాలుగా తాము జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఈ భూమికి సంబంధించిన పత్రాలు, పాసు పుస్తకాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కానీ ఎమ్మెల్యే స్థానిక అధికారులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించారంటూ దళిత మహిళ రాజేశ్వరి ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా తమను తమ స్థలం నుంచే లాగిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకోవడం లేదని బాధితురాలి ఆరోపణలు
ఓ దళిత మహిళకు చెందిన ఏడు ఎకరాల ఐదు సెంట్ల భుమిలో రెండు ఎకరాల భుమిని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం పేరుతో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు భూమిని కబ్జా చేస్తున్నారని రాజేశ్వరి ఆరోపించారు. మహిళకు సంబంధించిన, అందులోనూ దళితులకు చెందిన భూమిని ఆక్రయించుకోవడం దారుణంమని చిత్తూరు నగరం శివారు ప్రాంతంమైన ఇరువారంకు చెందిన రాజేశ్వరి ఆరోపించారు. గత ఏడాదిగా తమపై దౌర్జన్యం చేస్తూ భూమి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని, ఇదే విషయంపై అనేకమార్లు పోలీసులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె వాపోయారు. ఈ క్రమంలోనే తమకు వారసత్వంగా వచ్చిన భూమిపై తమను హక్కు ఉందంటూ కోర్టుకు వెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తమ కుటుంబంపై అనేక రకాలుగా ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకుని రావడం అన్యాయం అన్నారు. అన్యాయంగా పేదల భూమిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారా అంటూ దళిత మహిళ నిలదీశారు. ఎమ్మెల్యే శ్రీనివాసులకు పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారని, తమకు కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాధితురాలు రాజేశ్వరి.