Anantapur News : అనంతపురం జిల్లా దేవరకొండలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి కలకలం రేపుతోంది. ఉమాపతి తన కారు డ్రైవర్ ను దించేసి.. ఆయనే స్వయంగా కారు నడుపుతూ కొండ కిందికి దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఉమాపతి అక్కడికక్కడే మృతి చెందారు. అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు కొండ కిందకు దూసుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. 


అసలేం జరిగింది? 


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్‌ కరస్పాండెంట్ ఉమాపతి(56) సూసైడ్ చేసుకున్నారు.  దేవరకొండలో కరస్పాండెంట్ ఉమాపతి, కారు డ్రైవర్‌ ఓ కొండపైకి వెళ్లారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు దింపేసిన కరస్పాండెంట్ ఉమాపతి... స్పీడ్‌గా కారును డ్రైవ్‌ చేసుకుంటూ కొండ పై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమయంలో డ్రైవర్‌ వీడియో తీశాడు. సార్‌ సార్‌ అంటూ డ్రైవర్ అరుస్తున్నా ఉమాపతి పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలే ఉమాపతి ఆత్మహత్యకు కారణాలు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


కారు ప్రమాదంలో బీజేపీ నేత మృతి


కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత  పాటిల్‌ నీరజారెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్‌ పేలి ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే కర్నూలు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. పాటిల్ నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఫ్యాక్షన్‌ గొడవల కారణంగా హత్యకు గురయ్యారు.  నీరజారెడ్డి కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి నీరజారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకు ముందు పత్తికొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై 5వేల ఓట్ల మెజార్టీతో నీరజారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.